వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి మోహన్‌రావు

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి మోహన్‌రావు - Sakshi


జగన్‌ పోరాటానికి ఆకర్షితుడినై పార్టీలో చేరానని వెల్లడి

వైఎస్‌ జగన్‌ను సీఎం చేయాలన్నదే లక్ష్యం




సాక్షి, హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కేవీసీహెచ్‌ మోహనరావు మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయన తన అనుచరులతో వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులకు జగన్‌.. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ముఖ్యనేతలు చలమశెట్టి సునీల్, పెండెం దొరబాబు (మాజీ ఎమ్మెల్యే), ఇతర నేతలు అనంతబాబు, చెన్ను పెద్దిరాజు, కర్రి వెంకటరమణ హాజరయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మోహన్‌రావు చేరికతో ఆ జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అదనపు బలం చేకూరిందని భావిస్తున్నారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు.



ప్రతిపక్ష నేతగా జగన్‌ రాజీలేని పోరాటం : మోహనరావు

ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేతా చేయని రీతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మోహనరావు ప్రశంసించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ చేస్తున్న పోరాటానికి తాను ఆకర్షితుడనై అనుచరులతో సహా పార్టీలో చేరానన్నారు. పేద, బడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలన్నీ అమలు చేయగల సత్తా ఒక్క జగన్‌కే ఉందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం గట్టిగా కృషి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా కూడా గెలిపిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. పెండెం దొరబాబు మాట్లాడుతూ మోహనరావు చేరికతో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ బలం ఇంకా పెరుగుతుందన్నారు. అక్కడ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top