రేవంత్ X ఎర్రబెల్లి: బాబు రాజీయత్నం

ఎర్రబెల్లి-చంద్రబాబు-రేవంత్ రెడ్డి - Sakshi


 తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత రెడ్డిల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. టిడిపి ప్రారంభం నుంచి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేత, వరంగల్ జిల్లా పాలపర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి తెలంగాణ ముఖ్యమంత్రిని కె.చంద్రశేఖర రావుని కలిసేసరికి, అతను టిఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా అతనితోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్లో చేరుతున్నట్లు,  ఎర్రబెల్లికి మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది.



అయితే తనకు టిడిపిని విడిచిపెట్టే ఆలోచన లేనట్లు ఎర్రబెల్లి చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను తాను కలిశానని, అయితే  అర్థరాత్రి కాదని ఎర్రబెల్లి తెలిపారు. ఆదివారం సాయంత్రం 15 మంది ప్రముఖులతో పాటు కేసీఆర్ను కలిసినట్టు చెప్పారు. తనకు పార్టీ మారే ఉద్దేశంలేదని స్పష్టం చేశారు. జీవితాంతం టీడీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.  మెట్రో భూముల విషయంలో తనకు, రేవంత్‌కు మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉన్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. అయితే, ఈ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. మెట్రో భూముల విషయంలో రేవంత్ రెడ్డి మైహోమ్స్ అధినేత రామేశ్వర్ రావును విమర్శించినా పర్వాలేదన్నారు. అయితే ఆ విషయాన్ని ఉపయోచుకుని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్  చేయడం సరికాదన్నారు. మెట్రో భూముల విషయంలో  రామేశ్వర్ రావు తప్పుచేయలేదని ఇప్పటికీ తాను భావిస్తున్నానన్నారు.



ఈ నేపధ్యంలో మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈరోజు లేక్వ్యూ అతిధి గృహంలో చంద్రబాబును ఎర్రబెల్లి కలిశారు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రబెల్లి-రేవంత్ రెడ్డిల మధ్య విభేదాలను పరిష్కరించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఎర్రబెల్లి టిఆర్ఎస్లో చేరితే, తెలంగాణలో పార్టీకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు టిఆర్ఎస్లో చేరిపోయారు. అందువల్ల సాధ్యమైనంతవరకు ఎర్రబెల్లి చేజారకుండా చూడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఇద్దరికీ నచ్చజెప్పి సమస్యను పరిష్కరించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

**

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top