ఫేస్‌బుక్‌ ఫ్రెండే హంతకుడు

ఫేస్‌బుక్‌ ఫ్రెండే హంతకుడు - Sakshi


రహీం హత్య కేసులో వీడిన మిస్టరీ

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు


హైదరాబాద్: చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడురోజుల క్రితం జరిగిన ఎలక్ట్రీషియన్‌ హత్యకేసు మిస్టరీని చేధించారు. శనివారం ఎల్‌బీనగర్‌ ఏసీపీ వేణుగోపాల్‌రావు, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ గురురాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లాకు చెందిన షేఖ్‌రహీం అలియాస్‌ మున్నా నగరానికి వలసవచ్చి మలక్‌పేటలోని ఫ్లీట్‌మ్యాటిక్స్‌ కంపెనీలో పనిచేస్తూ న్యూ మారుతీనగర్‌లో నివాసం ఉండేవాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కొంపెల్ల నవీన్‌(23) మూడు నెలల కిత్రం ఫేస్‌బుక్‌ ద్వారా రహీంకు పరిచయం అయ్యాడు. చెన్నైలో ఉద్యోగం చేసి వచ్చిన అతను ఇసామియాబజారులో ఉండేవాడు. రహీం, నవీన్‌ తరచూ న్యూ మారుతీనగర్‌లోని గదిలో మందు పార్టీలు చేసుకునేవారు.



ఇదే క్రమంలో ఈ నెల 16న వారు ఇంటి సమీపంలో ఉండే పెయింటర్‌ లింగయ్యతో కలిసి మద్యం సేవించారు. ఈ సందర్భంగా రహీం ప్రియురాలిపై నవీన్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీనిని గమనించిన ఇంటి ఓనర్‌ అక్కడికి వచ్చి వారికి సర్దిచెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నవీన్‌ వైన్‌షాప్‌నకు వెళ్ళి మద్యం తీసుకురాగా మరోసారి కలిసి తాగారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న రహీంపై నవీన్‌ జిమ్‌ డంబుల్స్‌తో తలపై చితకబాది చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అతని పర్సు, సెల్‌ఫోన్లు తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత రహీం ఇంటికి వచ్చిన తోటి ఉద్యోగులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించి తలుపును పగలగొట్టారు. రక్తపు మడుగులో పడిఉన్న రహీంను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.



కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరోజు వారితో కలిసి మద్యం సేవించిన లింగయ్యను విచారించగా రహీం స్నేహితుడు వచ్చివెళ్లినట్లు తెలిపాడు. దీంతో రహీం ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసి స్నేహితుల ఫొటోలను చూపగా నవీన్‌గా గుర్తించాడు. అతని సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా నిందితున్ని శనివారం ఉదయం ఇసామియా బజార్‌లో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.1500 నగదు, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. హత్యకేసును  ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ గురురాఘవేంద్ర, ఎస్సైలు రత్నం, కోటయ్యలను ఏసీపీ అభినందించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top