ఏపీని మోసం చేశారిలా..

ఏపీని మోసం చేశారిలా.. - Sakshi


- ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ

- పదిహేనేళ్లు హోదా కావాలని చంద్రబాబు చెప్పారు

- ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారు,గద్దెనెక్కాక మాట మార్చేశారు

- ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపాటు

- ఎన్నికల ముందు ఎవరేమన్నారో దృశ్య సహితంగా ప్రదర్శన

 

 సాక్షి, హైదరాబాద్ :
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన రాజకీయ పార్టీల తీరుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై మోదీ, వెంకయ్య, చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఏం మాట్లాడారు? అధికారంలోకి వచ్చాక ఎలా మాట మార్చేశారు అనే అంశాన్ని వివరించారు. వారు అప్పట్లో ఏం చెప్పారో మీరే చూడండంటూ సంబంధిత వీడియోలను టీవీలో విలేకరుల ఎదుట ప్రదర్శించారు.

 

 చంద్రబాబు ప్లేటు మార్చేశారు

 ‘‘ప్రత్యేక హోదా అంశంపై ఎన్నికల ముందు చంద్రబాబు ఏం మాట్లాడారో... గద్దెనెక్కాక ఎలా ప్లేటు మార్చేశారో, కేంద్రం ప్రభుత్వంతో ఎలా రాజీ పడ్డారో... మీరే(విలేకరులు) చూడండి. రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు ఎంత ముందున్నారో ఇట్టే తెలిసి పోతుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఓ పథకం ప్రకారం డ్రామాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టే బీజేపీ వాళ్లు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఫర్వాలేదని పార్లమెంట్ సాక్షిగా మొహమాటం లేకుండా చెప్పే పరిస్థితికి వచ్చారు’’ అని జగన్ విమర్శించారు.

 

 ఎన్నికల ముందు బాబు ఏం చెప్పారంటే...


 ‘‘మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఐదు సంవత్సరాలే ఇచ్చారు. నేను నరేంద్ర మోదీని కోరుతున్నా.... పదిహేను సంవత్సరాలు ఇవ్వండి. ఒక పరిశ్రమ రావాలంటే... రెండు మూడేళ్లు అవుతుంది. పని ప్రారంభమయ్యే లోగా ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం పదిహేనేళ్లు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతున్నా..’’

 

 ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో...

 ‘‘మరీ మరీ స్పెషల్ స్టేటస్ కావాలని కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏదో సంజీవని కింద అన్నీ అయిపోతాయని అంటున్నారు. ఏమొస్తాయండీ... రెండే వస్తాయి. రెండింటిలో ఒకటి ఈఏపీ (ఎక్ట్సర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్సు), రెండు కేంద్ర ప్రాయోజిత పథకాలు. ఈ పథకాలను తగ్గించేశారు. 62 నుంచి 52 శాతానికి వచ్చింది. ఈఏపీ ఎంత వరకు వచ్చింది? ఇవన్నీ కేంద్ర కేబినెట్‌కు పంపితే మళ్లీ వారు ఆమోదించాలి’’

 

 నరేంద్ర మోదీ మాటలు...

  (తిరుపతి ఎన్నికల సభలో చంద్రబాబు సమక్షంలో మోదీ హిందీలోప్రసంగించగా వెంకయ్య నాయుడు అనువదించారు)

 ‘‘సీమాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా లభించింది. నేను మీకు(ఏపీ ప్రజలకు) నమ్మకంగా చెబుతున్నా... మీరు నన్ను ఢిల్లీలో (ప్రధానిగా) కూర్చోబెడతారు. ఏ వాగ్దానమైతే మీకు చేశానో దాన్ని కచ్చితంగా అమలు చే సి మాట నిలబెట్టుకుంటాం. దానిని(ప్రత్యేక హోదా) ఇంకా పొడిగిస్తాం కూడా...’’

 మోదీ ప్రసంగాన్ని జగన్ ఉదహరిస్తూ... ఆనాడు ఎన్నికలున్నాయి కనుక ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇవాళ మాట తప్పడం ఎంతవరకు ధర్మం అని ప్రశ్నించారు.

 

 మరో సందర్భంలో...

 ‘‘నేనడిగేది, ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటస్సే... వారు(కేంద్రం) కాదు, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారనుకో... ఇక బాధేముంది, ఎక్కువ డబ్బులిస్తే నేను కాదనను కదా! కాదు,

 (నవ్వుతూ...) కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా!’’

 

 ఇంకొక సందర్భంలో...

 ‘‘ప్రత్యేక హోదాతోనే మొత్తం అంతా అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు, పదిహేనేళ్లు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదే? వాటీజ్ ద రీజన్

 (కారణాలేమిటి?)’’

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top