ఏళ్ల తర‘బడి’ నిర్లక్ష్యం!

ఏళ్ల తర‘బడి’ నిర్లక్ష్యం! - Sakshi


- ఉన్నత పాఠశాలలపై విద్యాశాఖ అలసత్వం

- 239 ప్రధానోపాధ్యాయ, 3,144 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

- 309 హైస్కూళ్లలో విద్యుత్ సదుపాయం లేదు..

- లోపాలపై నివేదిక కోరిన కేంద్రం

 

 సాక్షి, హైదరాబాద్: నిధులిస్తున్నా అధికారులు నిర్లక్ష్యం వీడడంలేదు. గుణపాఠాలను తీసుకోవడంలేదు. పాఠశాలల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టడంలేదు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్‌ఎంఎస్‌ఏ) కింద వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా ఉన్నత పాఠశాలల్లో సమస్యల పరిష్కారం, నాణ్యమైన విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడంలో విద్యాశాఖ అలసత్వం ప్రదర్శిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రధానోపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. మోడల్ స్కూళ్లలో బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం హాస్టళ్లను మంజూరు చేస్తే ఆ పనులను వేగంగా చేయించడంలో విఫలమైంది.



రాష్ట్రంలో 239 పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు లేరు. 3,144 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ పోస్టులు, హెడ్‌మాస్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రాలు యాన్యువల్ రిక్రూట్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేయాల్సిందేనని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఉన్నత పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు పక్కా చర్యలు చేపట్టాలని పేర్కొంది. పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి, లోపాలను సరిదిద్దేందుకు ఏమేం చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సుభాష్.సి.కుంతియా అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు.  



 ఇదీ ఉన్నత పాఠశాలల పరిస్థితి..

► రాష్ట్రంలోని 84.5 శాతం ఆవాస ప్రాంతాల్లోనే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉంది. మిగతా 15.5 శాతం ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలలు లేవు.  8, 9వ తరగతులకు వెళ్తున్న విద్యార్థులు 97.16 శాతం  మంది ఉన్నారు. ఉన్నత పాఠశాలల్లో 15.53 శాతం మంది విద్యార్థులు డ్రాపవుట్స్ అవుతున్నారు.  

► రాష్ట్రంలోని 309 ఉన్నత పాఠశాలలకు ఇంకా విద్యుత్ సదుపాయమే లేదు. మరో 14 పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నా పని చేయడం లేదు.

► ఆర్‌ఎంఎస్‌ఏ కింద రాష్ట్రంలో 8 కొత్త పాఠశాలలను నిర్మించేందుకు కేంద్రం ఆమోదించగా వాటిలో ఒక్క కొత్త పాఠశాలను కూడా నిర్మించలేదు.

► రాష్ట్రంలో విద్యాపరంగా వెనుకబడిన మండలాలు 396 ఉన్నాయి. వాటిల్లోని 255 మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్ల నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. వాటిల్లో 113 పాఠశాలలల్లో బాలికల హాస్టళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. 93 పాఠశాలల్లో బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులనే ప్రారంభించలేదు.

► తెలంగాణలో 5,615 ఉన్నత పాఠశాలలుండగా 4,883 పాఠశాలల్లోనే స్కూల్ మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ కమిటీలు (ఎస్‌ఎండీసీ) ఉన్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top