ఎంసెట్ లీకేజీ సూత్రధారులు దుబాయ్ దౌడ్

ఎంసెట్ లీకేజీ సూత్రధారులు దుబాయ్ దౌడ్ - Sakshi


పరారైన షేక్ నౌషాద్ అలీ, గుడ్డూ

వారి ఆచూకీ కోసం ఐదు రోజులుగా సీఐడీ గాలింపు

పారిపోయినట్లుగా ఆధారాలు సేకరించిన అధికారులు

శుక్రవారం దుబాయ్‌కి వెళ్లిన ప్రత్యేక బృందం!

సీఐడీ అదుపులో నౌషాద్ అనుచరుడు రాజేశ్, బ్రోకర్ రామకృష్ణ

రాజగోపాల్‌రెడ్డి అరెస్టును ప్రకటించిన అధికారులు

లీకేజీ కుట్రను ఛేదించేందుకు 300 మంది పోలీసులు


 

హైదరాబాద్ : ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో కీలక కుట్రదారులు దేశం విడిచి పారిపోయారా.. ఆరు రోజుల కిందే వారు దుబాయ్‌కి చెక్కేశారా..? అవుననే అంటున్నాయి సీఐడీ వర్గాలు. ముంబై కేంద్రంగా ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీలో కీలకంగా వ్యవహరించిన షేక్ నౌషాద్ అలీ, గుడ్డూలను పట్టుకోవడానికి సీఐడీ బృందాలు విశ్వప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సీఐడీకి చిక్కిన బ్రోకర్లు వెల్లడించిన సమాచారం ఆధారంగా వారి ఆచూకీ కోసం 6 రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే వారు దేశం విడిచి దుబాయ్‌కి పారిపోయినట్లు కొన్ని ఆధారాలు సీఐడీకి లభించాయి.



ఈ నేపథ్యంలో అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుట్రదారుల ఆచూకీ తేల్చేందుకు సీఐడీ ప్రత్యేక బృందం శుక్రవారం దుబాయికి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. నౌషద్, గుడ్డూలు పట్టుబడితేనే.. ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చింది, ఎవరెవరికి చేరింది, ఎంత మొత్తం చేతులు మారిందనే అంశాలు కొలిక్కి వచ్చే అవకాశముందని సీఐడీ భావిస్తోంది. ఇక ఈ కుంభకోణానికి సంబంధించి శనివారం మరో ఇద్దరు బ్రోకర్లను సీఐడీ అదుపులోకి తీసుకుంది. వీరిలో ఢిల్లీకి చెందిన రాజేశ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్ ప్రశ్నపత్రాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. మరో బ్రోకర్ రామకృష్ణను పుణెలో అదుపులోకి తీసుకున్న అధికారులు హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నారు.



ఆధారాలు మాయం!

ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన ముంబై గ్యాంగ్ తమ వివరాలు బయటకు పొక్కకుండా పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు పేపర్ లీక్ చేసేందుకు షేక్ నౌషద్, గుడ్డూ ప్లాన్ చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. వారు ఇంతకుముందే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో ఆరితేరినట్లు గుర్తించారు. ఎంసెట్-2 కుంభకోణం విషయం వెల్లడవగానే వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్లు, నంబర్లు మార్చేశారు. ఇదే క్రమంలో ఆరు రోజుల కిందే దుబాయికి పారిపోయినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.



 పేపర్ దొంగ దొరికాడు..

 ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఎంసెట్-2 ప్రశ్నపత్రాలు తస్కరించిన ముఠా సభ్యుడు రాజేశ్‌ను సీఐడీ ప్రత్యేక బృందం శనివారం అదుపులోకి తీసుకుంది. అతడ్ని ఒక రహస్య ప్రాంతంలో ఉంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రాజేశ్ కుటుంబంలోని సన్నిహిత వ్యక్తి మరణించాడని.. ఆ దుఖంలో ఉన్నందున గట్టిగా విచారించలేకపోతున్నామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు రాజేశ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. నౌషద్ ఆదేశాల మేరకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ తస్కరించినట్లు తెలిసింది. అంతవరకే తనకు తెలుసని, అందులో ఏముంది, దేనికోసమో తెలియదని రాజేశ్ చెప్పినట్లు తెలిసింది. ఇక పుణెలో పట్టుబడిన రామకృష్ణ.. షేక్ రమేశ్‌కు ప్రశ్నపత్రాన్ని అందజేసి, రూ.1.2 కోట్లు తీసుకున్నాడు. పుణెలో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని నిర్వహించి.. 14 మంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చాడు.



రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్

ఈ కుంభకోణంలో బ్రోకర్‌గా వ్యవహరించిన బెంగళూరు వాసి ఎస్.రాజగోపాల్‌రెడ్డి అలియాస్ గోవింద్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ శనివారం తెలిపారు. అతడిపై మెడికల్ ప్రవేశపరీక్ష లీకులకు సంబంధించి కర్ణాటక, ఏపీలలో కేసులున్నట్లు వివరించారు. అతను ఎంసెట్-2కు సంబంధించి.. హైదరాబాద్‌కు చెందిన సబ్‌బ్రోకర్ విష్ణుధర్ ద్వారా 14 మంది విద్యార్థులకు, విజయవాడకు చెందిన జ్యోతిబాబు ద్వారా మరో ఆరుగురికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడకు చెందిన బ్రోకర్ల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.1.25 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ఇక శనివారం అరెస్టు చేసిన వారిలో వెంకట రమణతో పాటు బండారు రవీంద్ర అలియాస్ రవి ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వెంకట రమణ దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌లలో రెజొనెన్స్ మెడికల్ అకాడమీ సంస్థను నిర్వహిస్తున్నాడు. బండారు రవీంద్ర రెజొనెన్స్ అకాడమీలో మెస్ నిర్వహిస్తున్నాడు. వారు నలుగురు విద్యార్థులకు బ్రోకర్ షేక్ రమేశ్ ద్వారా పుణెలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.


దర్యాప్తులో భారీగా సిబ్బంది

ఎంసెట్ లీకేజీ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేసేందుకు సీఐడీ చర్యలు చేపడుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్ శర్మ స్వయంగా సమీక్షిస్తున్నారు. సీఐడీ ఏడీజీ సత్యనారాయణ, ఐజీ సౌమ్యామిశ్రా, డీఐజీ రవి వర్మలను మానిటరింగ్ చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఇతర విభాగాల నుంచి సిబ్బందిని అటాచ్ చేసుకుని దాదాపు 300 మంది సిబ్బందితో నిందితుల కోసం సీఐడీ గాలిస్తోంది.



దొరికిన వారంతా ఏపీవారే!

ఎంసెట్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటి వరకు సీఐడీ అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారేనని అధికారులు పేర్కొన్నారు. రాజగోపాల్‌ది అనంతపురం జిల్లా కాగా షేక్ రమేశ్ ప్రకాశం జిల్లా వాసి అని తెలిపారు. సబ్‌బ్రోకర్లుగా పట్టుబడిన వారు కూడా ఏపీకి చెందిన వారే. రెజొనెన్స్ మెడికల్ అకాడమీ నిర్వహిస్తున్న వెంకట రమణ కృష్ణా జిల్లా చెందిన వాడిగా గుర్తించారు. బండారు రవీంద్ర కూడా ఏపీ చెందిన వ్యక్తేనని పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top