‘ఎంసెట్-2’ తర్వాతే ఆయుష్ కౌన్సెలింగ్

‘ఎంసెట్-2’ తర్వాతే ఆయుష్ కౌన్సెలింగ్ - Sakshi


 వైద్య ఆరోగ్యశాఖ యోచన

- వ్యవసాయ, ఉద్యాన,వెటర్నరీ కౌన్సెలింగ్‌లూ అప్పుడే...

ఎంబీబీఎస్‌లో సీటు రానివారే ఈ కోర్సులకు వెళ్తున్నందున ఈ ఆలోచన

 

 సాక్షి, హైదరాబాద్: మెడికల్ ఎంసెట్-2 పరీక్ష పూర్తయి, ఫలితాలు వెల్లడైన తర్వాతే ఆయుష్ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ యోచి స్తోంది. అయితే దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. మెడికల్ ఎంసెట్-1 దరఖాస్తుల ప్రక్రియ ముగిసే నాటికి ఆ పరీక్ష ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఆయుష్, వ్యవసాయ తదితర కోర్సులన్నింటికీ కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేశారు. తరువాత ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు నీట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మెడికల్ ఎంసెట్-1 కేవలం ఆయుష్, వ్యవసాయ దాని అనుబంధ కోర్సులకే నిర్వహించారు.



సందిగ్ధతల నేపథ్యంలో ఎందుకైనా మంచిదని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు కోరుకునే విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాశారు. మరోవైపు నీట్‌పై రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కోసం ఎంసెట్-2 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 9న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే ఆయుష్, వ్యవసాయ కోర్సులకు ఎంసెట్-1 ఫలితాలు వెల్లడి కావడం... మరోవైపు ఎంసెట్-2 పరీక్ష 40 రోజుల తర్వాత ఉండటంతో గందరగోళం నెలకొంది. పైగా ఎంసెట్-1 పరీక్ష రాసిన విద్యార్థులు అనేకమంది ఎంసెట్-2 రాస్తారు. అందువల్ల ఆయుష్, వ్యవసాయ కోర్సులకు ఎప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాలన్న దానిపై అధికారులు మధనపడుతున్నారు.



 అందరి ప్రాధాన్యం ఎంబీబీఎస్సే..: మెడికల్ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు వచ్చినవారు ఎంబీబీఎస్‌లో చేరేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఎంబీబీఎస్ సీటు రానివారు బీడీఎస్‌కు.. అందులోనూ సీటు రానివారు ఆయుర్వేద, హోమియో సీట్లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. వాటిల్లోనూ సీట్లు రానివారు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో చేరేందుకు సిద్ధమయ్యేవారు. ఈ ఏడాది మెడికల్ ఎంసెట్-1కు హాజరైనవారు ఎక్కువగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ల కోసమే రాశారు. నీట్ కారణంగా అది కాస్తా ఆయుష్, వ్యవసాయ కోర్సులకే పరిమితమైంది.ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ల కోసమే నిర్వహించే ఎంసెట్-2 పరీక్ష పూర్తికాకుండా ఆయుష్, వ్యవసాయ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ కౌన్సెలింగ్ నిర్వహించినా టాప్ ర్యాంకులు సాధించినవారే ఎందుకైనా మంచిదని వచ్చిన ఆయుష్, వ్యవసాయ కోర్సుల్లో చేరిపోతారు.



ఆ తర్వాత ఎంసెట్-2లో మంచి ర్యాంకులు వచ్చినవారు ఆయుష్, వ్యవసాయ సీట్లను వదులుకొని ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో చేరతారు. దీంతో ఆయుష్, వ్యవసాయ సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. పైగా సీటు వదులుకునే సందర్భంలో చెల్లించిన ఫీజులో కొంత కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఎంసెట్-2  కౌన్సెలింగ్ తర్వాతే ఎంసెట్-1లోని ఆయుష్, వ్యవసాయ కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. దీనిపై అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top