రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-చలాన్లు

రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-చలాన్లు


- ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు ఏర్పాట్లు

- ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ చెల్లించే సదుపాయం

- మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు అధికారుల సన్నాహాలు  


 

సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో మరో వినూత్న ప్రక్రియను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపునకు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత చలానా పద్ధతికి స్వస్తి పలికి, దాని స్థానంలో ఈ-చలాన్ల ప్రక్రియను ప్రవేశపెట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించే  దిశగా అధికారులు ఈ-చలానా ప్రక్రియను రూపొందిస్తున్నారు. పూర్తిగా ఆన్‌లైన్ ప్రక్రియ కావడంతో వినియోగదారులతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇకపై బ్యాంకులు, ట్రెజరీల చుట్టూ తిరిగే పని ఉండదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ అమలు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్)తో రిజిస్ట్రేషన్ల శాఖ త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది.

 

 ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం ఎస్‌ఎస్‌ఎల్


 బ్యాంకుల తో ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించేందుకు అవసరమైన సెక్యూరిటీ సాకెట్ లేయర్ (ఎస్‌ఎస్‌ఎల్) సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ శాఖకు లభించింది. దీంతో ఎస్‌బీహెచ్ ఇంట ర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా సొమ్ము చెల్లింపు, స్వీకరణ సేవలను వినియోగించుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మార్గం సుగమమైంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న బ్యాంకు శాఖలో మాత్రమే వినియోగదారులు చలాన్లు చెల్లించవలసి వచ్చే ది. ఈ-చలాన్ల ప్రక్రియ అందుబాట్లోకి వస్తే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే ఆన్‌లైన్ లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 950 ఎస్‌బీహెచ్ శాఖల్లో ఎక్కడైనా ఆఫ్‌లైన్‌లోనూ స్టాంప్ డ్యూటీ చెల్లించవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ల ఖాతాలను రద్దు పరిచి కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పేరిట ఒకే ఖాతా నెంబరుకు సొమ్ము జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.  

 

 దొంగ చలాన్లకు చెక్...


 ఏదైనా బ్యాంకులో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టాంప్ డ్యూటీ చెల్లించిన వినియోగదారులకు రశీదుతో పాటు 12 అంకెలు కలిగిన కోడ్ నెంబరును బ్యాంకు అందిస్తుంది. వినియోగదారులు తమవద్ద ఉన్న ర శీదు, బ్యాంక్ ఇచ్చిన కోడ్ నెంబరును సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు వివరాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్‌పై ముద్రించేలా అధికారులు చర ్యలు చేపట్టారు. దీంతో దొంగ చలాన్లను అరికట్టడంతో పాటు తాము చెల్లించిన మొత్తానికి వినియోగదారులకు భరోసా కల్పించినట్లవుతుందని శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు అంతా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచి ఈ-చలాన్ల ప్రక్రియను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top