దుమ్ము సిటీ

దుమ్ము సిటీ


పెరుగుతున్న వాయు కాలుష్యం

ధూళితో పరిస్థితి ఆందోళనకరం

పీసీబీ నివేదికలో వెల్లడి

సిటీ జనులపై వ్యాధుల పంజా


 

దుమ్ము...ధూళి... కలసికట్టుగా దండెత్తుతున్నాయి. నగర జీవిపై వ్యాధుల పంజా విసురుతున్నాయి. మన చుట్టూ ఉన్న

వాహనాలు... మనం వినియోగిస్తున్న వాహనాలు... మన  ఆయువునే హరించేందుకు చూస్తున్నాయి. విషతుల్య

రసాయనాలు వదులుతూ కొన్ని పరిశ్రమలు వీటికి తోడుగా  నిలుస్తున్నాయి. గ్రేటర్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలని

 కలలుగంటున్న పాలకులు...చాపకింద నీరులా జనం ఆరోగ్యాన్ని హరిస్తున్న కాలుష్య భూతంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని

 గుర్తు చేస్తున్నాయి. నగరంలోని 22 ప్రధాన ప్రాంతాలను  ఎంచుకున్న కాలుష్య మండలి అధికారులు... అక్కడ నాలుగేళ్లలో నమోదైన కాలుష్య తీవ్రతను గుర్తించారు.

 

సిటీబ్యూరో:  గ్రేటర్ నగరాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా... విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఒకవైపు సర్కారు ప్రణాళికలు సిద్ధంచేస్తుంటే... మరోవైపు మానవాళి మనుగడకు అత్యావశ్యకమైన పీల్చే గాలిలో కాలుష్య మోతాదు పెరిగిపోయి సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.  పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్న కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలను కట్టడి చేయకపోతే అంతర్జాతీయ విపణిలో నగర కీర్తిప్రతిష్ఠలు మసకబారే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐటీ, హార్డ్‌వేర్, టూరిజం, రియల్టీ రంగాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న క్రమంలోనేకాలుష్య నివారణపైనా శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. నగరంలో వాయు కాలుష్య తీవ్రతను పరిశీలిస్తే ఆందోళన కలిగించే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

 

పొగ చూరుతోంది




మహా నగరంపై దుమ్ము, ధూళి పంజా విసురుతున్నాయి. కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కడం, ఇంధన కల్తీ, పారిశ్రామిక కాలుష్యం సిటీజనులతో చెలగాటమాడుతున్నాయి. నాలుగేళ్లుగా గ్రేటర్ పరిధిలో పీల్చే గాలిలో ధూళి రేణువుల (రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్-ఆర్‌ఎస్‌పీఎం) సాంద్రత ఆందోళన కలిగించే స్థాయిలో పెరిగిపోయిందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కగట్టింది. 2011, 2012, 2013, 2014 సంవత్సరాల్లో మహా నగరంలోని 22 ప్రధాన కేంద్రాల్లో ఆర్‌ఎస్‌పీఎం ఏమేరకు పెరిగిందో ఓ నివేదికలో వివరించింది.



పెరుగుతున్న ఇంధన వాడకం



గ్రేటర్‌లో నాలుగేళ్లుగా ఏటా రెండు లక్షల చొప్పున కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అన్ని రకాల వాహనాల సంఖ్య సుమారు 41 లక్షలకు చేరుకుందని పీసీబీ వర్గాల అంచనా. వీటికి ఏటా 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఇంధన వినియోగం పెరగడంతో గాలిలో ధూళి రేణువుల మోతాదు పెరుగుతోందని పీసీబీ నిగ్గు తేల్చింది. రాష్ట్రంలో ఇంధనం వినియోగంలో మహా నగరం పరిధిలోనే 50 శాతం ఉంది. గ్రేటర్‌లో  రహదారులు 6411 కిలోమీటర్లే ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి... సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతోంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి ఆర్‌ఎస్‌పీఎం గాలిలో కలుస్తున్నాయి.

 

ఆర్‌ఎస్‌పీఎం నమోదైన ప్రాంతాలివే...



రాజేంద్రనగర్, సెంట్రల్‌యూనివర్సిటీ, శామీర్‌పేట్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, సైనిక్‌పురి, జూపార్క్, ట్యాంక్‌బండ్, చిక్కడపల్లి, ఇమ్లిబన్, మాదాపూర్, నాచారం, కూకట్‌పల్లి, ఉప్పల్, అబిడ్స్, జీడిమెట్ల, సనత్‌నగర్, బాలానగర్,చార్మినార్, ప్యారడైజ్, లంగర్‌హౌజ్, పంజగుట్ట.

 

ధూళి రేణువులతో దుష్ర్పభావాలివే



ఆర్‌ఎస్‌పీఎం రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాస కోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది.    చికాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి.  ఆర్‌ఎస్‌పీఎం మోతాదు పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు అధికమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే.గంట పాటు ట్రాఫిక్ రద్దీలో ప్రయాణం చేసిన వారు చురుకుదనం కోల్పోయి, ఒళ్లంతా మగత, నొప్పులతో బాధ పడుతున్నారు.ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం వల్ల కలిగే దుష్ర్పభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.  



 నివారణ చర్యలు అత్యవసరం...



నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు 12 ఏళ్లు పైబడి, పొగ వెదజల్లుతున్న వాహనాలు రోడ్డెక్కకుండా రవాణా శాఖ చర్యలు తీసుకోవాలి. పొగ వెదజల్లుతున్న ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేయాలి.  కలీ ్తఇంధనాలు, కిరోసిన్‌తో నడుపుతున్న ఆటోలు రోడ్డెక్కకుండా చర్యలు తీసుకోవాలి.     జీడిమెట్ల, పాశమైలారం, బాలానగర్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున పొగ వెదజల్లుతున్న కాలుష్య కారక పరిశ్రమలను కట్టడి చేయాలి.పరిశ్రమల్లో అధిక ఎత్తున్న పొగ గొట్టాలను ఏర్పాటు చేయాలి. కాలుష్య ఉద్గారాలను ఫిల్టర్ల ద్వారా తొలగించిన తరవాతనే వాయువులను బయటికి వదిలేలా చర్యలు తీసుకోవాలి.



తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు తథ్యం



నగరంలో పీల్చే గాలిలో ఆర్‌ఎస్‌పీఎం మోతాదు పెరగడంతో న్యుమోనియా, అస్తమా కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి.క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి-సీఓపీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడడం) వంటి వి ప్రబలుతున్నాయి. చిన్న పిల్లల్లో ఊపిరితిత్తుల పెరుగుదల అర్థంతరంగా ఆగిపోతోంది. గర్భిణులు కాలుష్యం బారిన పడడంతో తక్కువ బరువున్న పిల్లలు పుడతారు. అలర్జీతో బాధపడే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.



 -డాక్టర్ సునంద, పల్మనాలజిస్టు, కేఆర్ ఆస్పత్రి

 

 

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top