డీటీసీ అవినీతిలో ‘అధికార’ వాటా

డీటీసీ అవినీతిలో ‘అధికార’ వాటా - Sakshi


♦ ఏపీ అధికార పార్టీ నేతల అండతోనే మోహన్ అవినీతి

♦ మోహన్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు

 

 సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఆదిమూలం మోహన్ అవినీతిలో ఏపీ అధికార పార్టీ నేతలకు భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  ఏపీ అధికార పార్టీ నేతల అండతోనే మోహన్ అవినీతి వ్యవహారాలు సాగించినట్లు రవాణా శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది రవాణా శాఖ బదిలీల సమయంలో మోహన్‌కు తూర్పు గోదావరి జిల్లాలో డీటీసీగా పోస్టింగ్ ఇప్పించేందుకు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఉన్నత స్థాయిలో పట్టుబట్టి మరీ మోహన్‌కు పోస్టింగ్ ఇప్పించారు.



రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి రవాణా శాఖ పోస్టింగుల్లో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. 8మంది రవాణా అధికారులకు పోస్టింగుల కోసం రూ.5 కోట్లు వసూలు చేశారు. మోహన్‌కు డీటీసీగా పోస్టింగ్ ఇప్పించినందుకు ప్రతిఫలంగా ఏపీ అధికార పార్టీ నేతలకు, పార్టీ కార్యక్రమాలకు ఇతోధికంగా సాయమందించారన్న ఆరోపణలున్నాయి. మోహన్ అవినీతిలో పలువురు ఎమ్మెల్యేలు వాటాలు పొందినట్లు తెలుస్తోంది. చివరకు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన మోహన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా లో పలు విద్యాసంస్థలు, అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు, సెటిల్‌మెంట్లలోనూ అధికార పార్టీ నేతలకు వాటాలున్నాయి.



 రవాణా శాఖ బదిలీల్లోనూ మోహన్ పైరవీలు

 మోహన్ పనిచేసిన జిల్లాల్లో రవాణా శాఖ బదిలీలు, పదోన్నతులలో పెద్ద ఎత్తున పైరవీలు సాగించినట్లు రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎంవీఐ పోస్టుకు రూ.15 నుంచి రూ.20 లక్షలు, ఏఎంవీఐ పదోన్నతులకు భారీగా సొంత శాఖ అధికారుల నుంచే రూ.కోట్లలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. పోస్టింగులు, గతంలో రవాణాశాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిని అడ్డుపెట్టుకుని పదోన్నతుల్లో మోహన్ తన దందా సాగించారు. సదరు ఉన్నతాధికారి అప్పట్లో విమానాశ్రయంలో భారీ నగదుతో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఏసీబీ దాడుల్లో చిక్కిన రవాణా అధికారులకు పోస్టింగులిప్పించడంలోనూ, విచారణను ఉపసంహరించడంలోనూ ఉన్నత స్థాయిలో చక్రం తిప్పిన మోహన్ ఇప్పుడు తనపై కేసునుంచి ఏ విధంగా బయటపడతారో.. అన్న వ్యాఖ్యలు సొంత శాఖ అధికారులు వ్యక్తం చేయడం గమనార్హం.

 

 డీటీసీ మోహన్ అవినీతి స్టైల్ ఇదీ..

 చెక్‌పోస్టుల్లో టేబుల్ కలెక్షన్ల పేరిట రవాణా శాఖ అధికారులు ప్రతి రోజూ రూ.లక్షల్లో బహిరంగంగానే ముడుపులు స్వీకరిస్తారు. ఈ కలెక్షన్లన్నీ తనకే చెందాలని అధికారులను బెదిరించడం మోహన్ నైజం. నెల్లూరు జిల్లాలో పనిచేసిన సమయంలో టార్గెట్లు విధించి మరీ వసూళ్లు చేసేవారని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాకినాడ పోర్టు నుంచి రవాణా జరిగే సరుకు లారీల నుంచి, లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంకర్ల అసోసియేషన్లతో సెటిల్‌మెంట్లు రివాజుగా మారాయి. ఏదైనా వాహనం పట్టుబడితే జరిమానా కట్టాలి. ఈ జరిమానా మొత్తాన్ని రెండుగా విభజించి వాహనదారుల నుంచి వసూలు చేయడం అలవాటని తెలుస్తోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top