15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్

15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ - Sakshi


 ‘ఓరుగల్లు’ గెలుపు సంబురంతో ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు

 నెల రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

 15 వేల నుంచి 20 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ

 పది రోజుల్లో మహిళా సంఘాలకు తీపి కబురు..

 డబుల్ బెడ్‌రూం ఇళ్లలో జర్నలిస్టులకూ కోటా

 ప్రతి మంత్రికి రూ.25 కోట్లతో డెవలప్‌మెంట్ ఫండ్

 అన్ని వర్గాలకు చెందిన పేదలకు ‘కల్యాణ లక్ష్మి’ వర్తింపు

 నెలలో నామినేటెడ్ పదవుల భర్తీ

 జనవరి తర్వాత జిల్లాల్లో బస్సు యాత్రలు.. ఆరు నుంచి ఎనిమిది రోజులు జిల్లాల్లోనే గడుపుతా

 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం

 ఆయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తా

 జానారెడ్డి గులాబీ కండువా రెడీగా పెట్టుకోవాలి..

 ప్రతిపక్షాలు ఇప్పటికైనా హుందాగా వ్యవహరించాలి


 సాక్షి, హైదరాబాద్:

 ఓరుగల్లు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మహిళలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇలా అన్ని వర్గాల వారికీ ప్రయోజనం కల్పించే చర్యలు చేపడతామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వారం పది రోజుల్లో వారికి తీపి కబురు వినిపిస్తా. కాంట్రాక్టు కార్మికులను నెల రోజుల్లో పర్మనెంటు చేస్తాం. డీఎస్సీ ప్రకటన కూడా విడుదల చేస్తాం. 15 వేల నుంచి 20 వేల పోస్టులు ఉంటాయి. పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం.

 

 డీఎస్సీ-98 క్వాలిఫైడ్ వారికీ ఉద్యోగాలు ఇస్తాం..’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది 65 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని, వాటర్ గ్రిడ్ ద్వారా రెండేళ్లలో ఇంటింటికీ నల్లా నీరిస్తామని చెప్పారు. పేదల ఇళ్లలో నల్లాలు కూడా ప్రభుత్వమే బిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు లక్షల మంది పేద క్రైస్తవులకు వస్త్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించామని.. బీపీఎల్ కార్డులున్న అందరికీ కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపచేస్తామని ప్రకటించారు. బీసీలు, అగ్రవర్ణాల్లోని పేదలకూ ఇది వర్తిస్తుందని, వచ్చే మార్చి నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రులు చురుగ్గా పనిచేయడానికి రూ. 25 కోట్లు స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేర వారి దగ్గర నిధులు పెట్టనున్నట్లు తెలిపారు.

 

 ప్రజలతో మమేకం అవుతాం..

 రాష్ట్ర ప్రజలతో మమేకం అయ్యేందుకు జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘‘జనవరి తర్వాత హైదరాబాద్‌లో ఉండను. బస్ యాత్ర ప్రారంభిస్తా. ఆరు నుంచి ఎనిమిది రోజులు పాటు జిల్లాల్లోనే గడుపుతా. జిల్లా ప్రజలందరితో మమేకం అవుతా..’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 231 కరువు మండలాలను ప్రకటించామని, కేంద్రాన్ని రూ.వెయ్యి కోట్లు సాయం కోరామని చెప్పారు. ఆశ కార్యకర్తల తరఫున టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతారన్నారు. పత్తికి మద్దతు ధర కేంద్రం పరిధిలోదని, ఎన్నికల్లో ఈ అంశాన్ని ఇష్యూ చేశారని పేర్కొన్నారు. యూనివర్సిటీ హాస్టళ్లు, కాలేజీ హాస్టళ్లకూ సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. గతంలో యూనివర్సిటీలకు నియమించిన వీసీలు అవినీతిపరులని, ఉద్యోగాలు అమ్ముకుని పోయారని ఆరోపించారు. నెల రోజుల్లో వీసీ పోస్టులను భర్తీ చేస్తామని, వర్సిటీలకు గ్రాంట్లు కూడా పెంచుతామని చెప్పారు.

 

 ‘గ్రేటర్’ మాదే!

 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని, 80 స్థానాలు పొందుతామని సర్వేలో తేలిందని సీఎం కేసీఆర్ చెప్పారు. నెల రోజుల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, కార్యకర్తలకు సమయం ఇస్తానని తెలిపారు. మార్కెట్ కమిటీ పదవుల భర్తీ వారంలో మొదలు పెడతామని, పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను పదిహేను రోజుల్లో మొదలు పెడతామని పేర్కొన్నారు. ‘‘ధర్మంగా, న్యాయంగా పనిచేస్తున్నాం. అవినీతికి దూరంగా, నోరు, కడుపు క ట్టుకుని పనిచేస్తున్నాం. గతంలో హౌసింగ్‌లో కుంభకోణాలు జరిగాయి. ఈసారి పూర్తి బాధ్యత అధికారులకే అప్పజెప్పాం. నిబద్ధతతో చేస్తున్నాం. ఒక ఊరిలో 80 మంది లబ్ధిదారులున్నప్పుడు... ఈసారి 40 మందికే ఇవ్వాల్సి వస్తే, అందరినీ లబ్ధిదారులుగా ప్రకటించి, లాటరీ తీసి నలభై మందిని ఎంపిక  చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీలో 2,500 ఆటోలు పంపిణీ చేయనున్నామని, పార్టీలకు అతీతంగా నియోజకవర్గాలను కవర్ చేస్తున్నామని చెప్పారు.

 

 గుడ్డి వ్యతిరేకత మానుకోండి..

 ఇప్పటికైనా గుడ్డి వ్యతిరేకతను మానుకుని నిర్మాణాత్మకంగా, హుందాగా ప్రవర్తించాలని విపక్షాలకు కేసీఆర్ హితవు చెప్పారు. తాము తప్పులు చేయలేదని ప్రభుత్వ అనుకూల ఓటు నిరూపించిందని స్పష్టం చేశారు. ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు రావడానికి ఇంకా మూడున్నరేళ్లు ఉంది. ఇక అంతా కూటమిగా కలిస్తే ఏమిటి? ఇప్పుడు అందరికీ కలిపి కూడా మా అన్ని ఓట్లు రాలేదు. ఉప ఎన్నికల్లో పనితీరు కీలకం. ఒకవేళ అధికార పార్టీ గెలుస్తుందంటే... ఢిల్లీలో, బిహార్‌లో బీజేపీ ఎందుకు ఓడింది..?’’ అని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పారు.

 

 కేంద్రంతో మాట్లాడాం..

 ఇప్పుడు అర్బన్ హౌసింగ్ కేటాయింపులే జరిగాయని.. బ్యాంకు లింకేజీతో నిర్మించే ఇళ్ల పథకాన్ని తెచ్చుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో కూడా మాట్లాడామని, రూ. 6 లక్షల వార్షికాదాయం ఉన్న ప్రైవేటు ఉద్యోగులకూ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. ‘‘డబుల్ బెడ్‌రూం ఇళ్లలో పోలీసు కానిస్టేబుళ్లు, హోం గార్డులు, మాజీ సైనికోద్యోగులకు 10 శాతం రిజర్వు చేస్తున్నాం. కొందరు జర్నలిస్టులూ అడుగుతున్నారు. వారికీ ఒకటో, రెండో శాతం రిజర్వు చేస్తాం. మూడేళ్లలో కవర్ చేస్తాం..’’ అని హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు భూసేకరణను సత్వరం పూర్తి చేస్తామని,  టెండర్లు పిలిచే కంటే ముందే భూసేకరణ పూర్తవుతుందని చెప్పారు. ‘‘మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తయితే గులాబీ కండువా కప్పుకుంటానని జానారెడ్డి అన్నారు. ఆయన గులాబీ కండువా రెడీగా పెట్టుకోవాలి. అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. ఉద్యమ స్ఫూర్తితో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

చంద్రబాబును ఆహ్వానిస్తా..

‘‘ఆయుత చండీయాగం డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరుగుతుంది. దానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తాను. రాష్ట్రపతి వస్తానన్నారు. కేంద్ర మంత్రులనూ ఆహ్వానిస్తాం..’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. యాగం గురించి సురవరం వంటి పెద్ద నేత విమర్శించడం బాధ కలిగించిందని... ప్రభుత్వ సొమ్ము ఎందుకు పెడతానని, సొంత డబ్బులే ఖర్చు చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top