ఇన్ఫోసిస్ సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం

ఇన్ఫోసిస్ సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం


*భర్త పరిస్థితి విషమం, కుమారుడికి గాయాలు

*మూడు కార్లు ధ్వంసం

*'మత్తు'లో కారు రేసింగ్‌తోనే ప్రమాదం




హైదరాబాద్: తప్ప తాగి... స్నేహితులతో కలిసి కారు రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తి సిగ్నల్ వద్ద నిలిపి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందగా... ఆమె భర్త, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.  ఎస్‌ఐ చింతకాయల వెంకటేశ్ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్  భోపాల్ పరిధిలోని సాగర్  గ్రామానికి చెందిన సోనీరాం చందానీ(36), హరీష్ ప్రసాద్(40) ప్రేమవివాహం చేసుకున్నారు. సోనీ ఇన్ఫోసిస్‌లో సాప్ట్వేర్ ఇంజినీర్ కాగా.. హరీష్ వ్యాపారం చేస్తున్నాడు.



వీరు మాదాపూర్‌లోని విఠల్‌రావునగర్‌లో ఉంటున్నారు. గురువారం రాత్రి 8.50కి బైక్‌పై హరీష్ ప్రసాద్, సోనీ, కొడుకు మోక్ష్(4) నానక్‌రాంగూడ నుంచి ఔటర్‌పై గచ్చిబౌలి వైపు వస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్‌లో రెడ్ సిగ్నల్ పడటంతో బైక్ ఆపాడు. ఔటర్‌పై వెనుక నుంచి వచ్చిన స్కోడా కారు (టీఎస్09 ఈసీ9599) బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను ఢీకొట్టింది.



దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే సోనీ మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో హరీష్ ప్రసాద్‌ను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. మోక్ష్‌కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. హోండా సిటీ కారులో ఉన్న ఓ మహిళ, వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హోండా సిటీ, ఇన్నోవా కార్లు ధ్వంసమయ్యాయి.  



రేసింగ్ వల్లే ప్రమాదం...

డెలాయిట్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేసే శ్వేతాబ్‌కుమార్ తోటి ఉద్యోగులు ఐదుగురిని తీసుకొని రేసింగ్‌కు బయలుదేరాడు. శంషాబాద్ నుంచి మితిమీరిన వేగంతో వస్తూ బైక్, కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కారులో ఉన్న బీరు సీసాలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారులో ఉన్న శ్వేతాబ్ కుమార్‌తో పాటు వినోద్, రిషాబ్, శ్రీవాత్సవలకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు.  శ్వేతాబ్ కుమార్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొంది పారిపోయాడన్నారు. పరారైనట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top