పబ్బుల్లో కామనే..

పబ్బుల్లో కామనే.. - Sakshi

- డ్రగ్స్‌ వినియోగంపై ఎక్సైజ్‌ సిట్‌కు వెల్లడించిన హీరో తరుణ్‌!  

పదమూడున్నర గంటల పాటు సిట్‌ విచారణ

 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగం సాధారణమేనని హీరో తరుణ్‌ ఎక్సైజ్‌ సిట్‌ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. 15 పెద్ద పబ్బుల్లో ఈ దందా నడుస్తోందని.. వాటిలో సెలబ్రిటీలకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని చెప్పినట్లు సమాచా రం. డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగోరోజు హీరో తరుణ్‌ను ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు విచారించారు. తరుణ్‌ ఉదయం 10 గంటలకు తన తండ్రితో కలసి ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకోగా.. 10.15 గంటలకు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, శ్యాం కె.నాయుడులను విచారించిన సమయంలో వెల్లడైన వివరాల ఆధారంగా సిట్‌ బృందాలు తరుణ్‌ను ప్రశ్నించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పబ్బుల్లో డ్రగ్‌ కల్చర్, వాటికి ఎక్కడి నుంచి డ్రగ్‌ వస్తుంది? ఎలా డీల్‌ చేస్తారు? గతంలో తరుణ్‌ సొంతంగా పబ్‌ నిర్వహించిన అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది.

 

పబ్బుల్లో ఇది సాధారణమే..!

ప్రస్తుతం హైదరాబాద్‌లోని 15 పెద్ద పబ్బుల్లో డ్రగ్స్‌ దందా నడుస్తోందని తరుణ్‌ వెల్లడించినట్టు సమాచారం. డ్రగ్స్‌ తీసుకునేందుకు ఈవెంట్‌ మేనేజర్లు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారని, తరచూ పబ్‌లకు వచ్చే వారిలా కాకుండా.. సెలబ్రిటీలకు ప్రత్యేక గదుల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తుంటారని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని, సరఫరా చేయలేదని ఆయన సిట్‌ వర్గాలతో పేర్కొన్నట్లు తెలిసింది.

 

గోవా సంగతేమిటి?

తరుణ్‌ పదే పదే గోవాకు వెళతారని, అక్కడ డ్రగ్స్‌ తీసుకుంటారని.. ఇందుకు జీశాన్, కెల్విన్‌లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపైనా సిట్‌ బృందాలు ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో గోవాకు వెళ్లే వారంతా డ్రగ్స్‌ తీసుకున్నారనుకుంటే ఎలాగని తరుణ్‌ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. తన స్నేహితులకు గోవాలో హోటళ్లు, రెస్టారెంట్‌ వ్యాపారాలు ఉన్నాయని.. వాటిలో తనకూ వాటాలు ఉన్నాయని, అందులో భాగంగానే గోవా వెళుతుంటానని చెప్పినట్లు సమాచారం. ఇక తాను సినిమా షూటింగ్‌లకు స్వస్తి చెప్పి చాలా కాలమైందని.. రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాల్లో బిజీగా ఉన్నానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

 

జీశాన్, కెల్విన్‌తో డ్యాన్సులేమిటి?

డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు జీశాన్, కెల్విన్‌లతో కలసి పబ్బులో తరుణ్‌ డ్యాన్స్‌ చేస్తున్న, మద్యం తాగుతున్న వీడియోలను చూపుతూ సిట్‌ బృందాలు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తాను నిర్వహించిన పలు ప్రైవేటు పార్టీలకు ఈవెంట్‌ మేనేజర్లుగా వారు పరిచయం అయ్యారని.. తరచూ పార్టీల్లో కలవడం వల్ల వీడియోల్లో ఉండవచ్చని తరుణ్‌ సమాధాన మిచ్చినట్లు తెలిసింది.

 

సోమవారం నుంచి వరుసగా..

డ్రగ్స్‌ కేసు విచారణలో ఆదివారం విరామం ఇచ్చా రు. సోమవారం నవదీప్, మంగళవారం రవితేజ, బుధవారం చార్మి, గురువారం ముమైత్‌ఖాన్‌ విచారణకు హజరవుతారని సిట్‌ తెలిపింది. 

 

క్లూస్‌ టీం విచారణ ఎందుకు?

నేర ఘటనల సమయంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించే క్లూస్‌ టీం శనివారం ఎక్సైజ్‌ సిట్‌ కార్యాలయానికి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరుణ్‌ను విచారించడంలో భాగంగానే క్లూస్‌ టీమ్‌ను పిలిపించారని.. తరుణ్‌ వేలిముద్రలు సేకరించారని ప్రచారం జరిగింది. దీనిపై సిట్‌ అధికారులు స్పందించలేదు. అదే విధంగా సిట్‌ కార్యాలయంలోనే కస్టడీలో ఉన్న జీశాన్, విలియంల వేలిముద్రలు సేకరించి ఉండవచ్చని.. సీజ్‌ చేసిన ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు, ఇతర డ్రగ్‌ ప్యాకెట్లపై వారి వేలిముద్రలను సాంకేతిక ఆధారాలుగా గుర్తించేందుకు ఈ పని చేసి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తమైంది.

 

అకున్‌కు బెదిరింపు కాల్స్‌పై విచారణ: డీజీపీ

డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు వచ్చిన బెదిరింపు కాల్స్‌ (ఇంటర్నెట్‌ కాల్స్‌)పై విచారణ జరుపుతున్నామని డీజీపీ అనురాగ్‌శర్మ శనివారం మీడియాకు తెలిపారు. దీనిపై ఇంటలిజెన్స్‌ బృందాలు విచారణ జరుపుతున్నాయని, రెండు రోజుల్లో ఎక్కడి నుంచి ఆ కాల్స్‌ వస్తున్నాయి? ఎవరు చేస్తున్నారు? అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియాకు, కెల్విన్‌ గ్యాంగ్‌కు సంబంధం ఏమైనా ఉందా.. అన్న కోణాల్లో పరిశీలన జరుగుతోందని చెప్పారు. అకున్‌ సబర్వాల్‌కు, అయన కుటుంబానికి భద్రత పెంచుతామన్నారు.

 

మరో ఇద్దరు అరెస్ట్‌

డ్రగ్స్‌ కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా.. ఎక్సైజ్‌ సిట్‌ మరో ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్లను శనివారం అరెస్టు చేసింది. మహ్మద్‌ ఉస్మాన్‌ అలియాస్‌ ఫైజల్‌ను అరెస్టు చేసి విక్రయానికి సిద్ధంగా ఉన్న 10 గ్రాముల ఎండీఎంఏను... అర్నవ్‌ మండల్‌ వద్ద 10 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల మ్యాజిక్‌ మష్రూమ్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక డ్రగ్‌ కేసులో కీలకంగా ఉన్న జీశాన్‌ అలీ, నియో విలియమ్‌ లను రెండు రోజలు పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. 

 

ఉపవాసం.. ఒక యాపిల్‌

మధ్యాహ్నం భోజనం కోసం అధికారులు విచారణకు విరామం ఇవ్వగా.. తరుణ్‌ శనివారం ఉపవాసమని చెప్పి ఆహారమేదీ తీసుకోలేదని తెలిసింది. దీంతో అధికారులు యాపిల్స్, జ్యూస్‌ తెప్పించి ఇచ్చినట్లు సమాచారం. ఇక సాయంత్రం సమయంలో ఉస్మానియా వైద్య బృందం తరుణ్‌Š రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కాగా ఉదయం 10.15 గంటలకు విచారణ మొదలుకాగా.. రాత్రి 11.40 గంటలకు తరుణ్‌ను బయటికి పంపించారు. అంటే సుమారు పదమూడున్నర గంటల పాటు సిట్‌ విచారణ సాగింది.


Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top