మత్తు-చిత్తు

మత్తు-చిత్తు - Sakshi


నైజీరియన్ డ్రగ్స్ ముఠాల దందా

మాదక ద్రవ్యాల అడ్డాగా హైదరాబాద్

విదేశీ మహిళ అరెస్టుతో కలకలం


 

సిటీబ్యూరో: మహా నగరం మాదక ద్రవ్యాల అడ్డాగా మారుతోందా? ఈ మత్తులో పడి... చిత్తవుతున్న వారి సంఖ్య పెరుగుతోందా? ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఇవే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఏటా వీటిని వినియోగించే వారు పెరుగుతుండటంతో సరఫరా... విక్రయాలు ఆ స్థాయిలోనే ఉంటున్నాయనే వాదన వినిపిస్తోంది. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిలో కొంతమంది సెలబ్రిటీలు.. సంపన్నులు ఉన్నట్టు కొన్ని సందర్భాల్లో తేలడం... యువత ఇటువైపు ఆకర్షితులవుతున్నారనే సమాచారం కలవరపరుస్తోంది. కొంతమంది సెలబ్రిటీలు మాదక ద్రవ్యాలు వినియోగించి గతంలో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా విదేశీ మహిళ మూసియా మూసా (32) పొట్టలోడ్రగ్స్ ప్యాకెట్లు పెట్టుకుని వచ్చి శంషాబాద్ విమానాశ్రయంలో నార్కోటిక్ డ్రగ్ కంట్రోలర్ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీనితో డ్రగ్స్ వ్యాపార అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రాణాలకు తెగించి ఆమె ఇంత సాహసం చేసిందంటే... నగరంలో డ్రగ్స్‌కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చని అధికారులే అంటున్నారు. ఆమె పొట్టలో దాదాపుగా  400 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఒక్కో గ్రాము ధర రూ.7 వేలు ఉంటుందని అంచనా. అంటే మార్కెట్లో రూ.28 లక్షల వరకు పలుకుతుందని అధికారులు చెబుతున్నారు.



సరదాగా మొదలై...

తీవ్ర ఒత్తిడిలో ఉన్న వారు డ్రగ్స్ తీసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని భావిస్తున్నారు. మరికొందరు ఏదో తెలియని ‘శక్తి’ కోసం మాదక ద్రవ్యాల రుచి చూస్తున్నారు. ఇదే అలవాటుగా మారి మోతాదుకు మించి తీసుకుంటూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. హెరాయిన్, కొకైన్, బ్రౌన్‌షుగర్, హెఫీడ్రిన్, ఓపీఎం వంటి మాదక ద్రవ్యాలు నగరంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది.

 

నైజీరియన్ల దందా..

 నగరంలో ఐటీ రంగం విస్తరించడంతో వివిధ ప్రాంతాల వారు వచ్చి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగం కావడంతో మానసిక ప్రశాంతతను పొందేందుకు వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఇది డ్రగ్స్ వైపు అడుగులు వేయిస్తోంది. జీతాలు భారీగా ఉండటంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. స్టూడెంట్ వీసాపై నగరానికి వచ్చిన నైజీరియన్లే ఇక్కడివారి అవసరాలను అనుకూలంగా మలచుకుని డ్రగ్స్ దందా మొదలెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అవసరాల కోసం మాత్రమే తొలినాళ్లలో డ్రగ్స్‌ను తీసుకొచ్చిన వీరు... ఆ తర్వాత వ్యాపార రీత్యా భారీ మొత్తంలో తేవడం ప్రారంభించారు. అలా ఈ వ్యాపారం నగరంలో చాప కింద నీరులా పెరిగిపోయింది. గోవాలోని జేజే అనే వ్యక్తి నుంచి నైజీరియన్లు డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి కూడా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తెప్పిస్తున్నారు. పబ్‌లలోనూ మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఉపయోగిస్తుండటంతో ఇప్పటికే వాటిపై పోలీసులు కన్నేశారు.  

 

గంజాయి హవా...


వీటితో పాటు స్థానికంగా గంజాయి వ్యాపారం బాగానే పెరిగింది. ఒడిశా సరిహద్దుల నుంచి వైజాగ్ మీదుగా వరంగల్ నుంచి హైదరాబాద్‌కు భారీ మొత్తంలోనే గంజాయి చేరుతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దీనికి బాగానే అలవాటు పడినట్టు కనిపిస్తోంది. ధూల్‌పేట్, హుమయూన్ బజార్, అఫ్జల్‌గంజ్, చిలుకలగూడలో గంజాయి లావాదేవీలు భారీగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. హుక్కా సెంటర్లలోనూ దీనిని వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో ఆ దిశగా పోలీసులు కన్నేసి ఉంచారు.

 

అవగాహన కల్పించాలి...

 మాదక ద్రవ్యవాల వల్ల కలిగేదుష్ఫలితాలపై నగర ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లోనూ జాగృతి కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని నార్కోటిక్ సెల్ అధికారి ఒకరు తెలిపారు. డ్రగ్స్ కేసులను విచారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

పెరుగుతున్న కేసులు


 మాదక ద్రవ్యాల కేసులను దృష్టిలో పెట్టుకుని 2012లో నార్కోటిక్ సెల్‌ను హైదరాబాద్ పోలీసులు ప్రారంభించారు. ఆ ఏడాదిలో రెండు కేసులు నమోదయ్యాయి. 2013లో పది కేసులు, 2014లో ఆరు కేసులు... ఈ ఏడాది ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయి.  

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top