ఏప్రిల్‌లోగా ఇంటింటికీ తాగునీరు

ఏప్రిల్‌లోగా ఇంటింటికీ తాగునీరు - Sakshi


9 నియోజకవర్గాల్లో శరవేగంగా పనులు

మేడ్చల్‌కు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్

మూడు సెగ్మెంట్లకు అదనంగా ఇళ్ల కేటాయింపులు


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని 9 నియోజకవర్గాలకు శరవేగంగా తాగునీటిని అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలోని జనగాం, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, నల్లగొండ జిల్లాలో భువనగిరి, ఆలేరు, మెదక్ జిల్లాలో దుబ్బాక, సిద్ధిపేట, గజ్వేల్, రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ సీఈని ఆదేశించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30లోగా ఈ నియోజకవర్గాల్లోని గ్రామాలకు తాగునీటిని అందించాలనే లక్ష్యాన్ని అధికారులకు నిర్దేశించారు.



ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి తాగునీరు అందేలా సమగ్ర ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. పనులు జరుగుతున్న ప్రాంతాలకు స్వయంగా వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని, పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల్లో మేడ్చల్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. పైపు లైన్లకు సంబంధించి భూ సేకరణలో ఇబ్బందులేమైనా ఉంటే సంబంధిత కలెక్టర్, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలని అన్నారు.



మేడ్చల్ ప్రాంతంలో ప్రస్తుతమున్న తాగునీటి సరఫరా వ్యవస్థను, కొత్త పైపులైన్లకు అనుసంధానం చేసే అవకాశాలేమైనా ఉన్నాయా.. అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, హౌసింగ్ కార్యదర్శి దాన కిశోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, మహబూబ్‌నగర్ కలెక్టర్ శ్రీదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

అదనంగా 1,650 ఇళ్లు

మేడ్చల్, తాండూరు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం కింద అదనంగా ఇళ్లను కేటాయించాలని సీఎం నిర్ణయించారు. సంబంధిత ఉత్తర్వు లు జారీ చేయాలని గృహనిర్మాణ శాఖ కార్యదర్శికి సూచించారు. ఈ మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న శామీర్‌పేట, ఉప్పర్‌పల్లి గ్రామాల్లో 250 ఇళ్లను నిర్మిస్తారు. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట మధ్యలో 800 ఇళ్లను నిర్మిస్తారు. తాండూరుకు 600 అదనపు ఇళ్లను మంజూరు చేస్తారు. మేడ్చ ల్ నుంచి ఆదిలాబాద్ వరకు జాతీయ రహదారి పొడవునా కొత్త ఇళ్లు నిర్మించాలని, అటు గా వెళ్లే వారందరినీ ఆకర్షించేలా ఈ నిర్మాణా లు మోడల్‌గా ఉండాలని సీఎం అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం లోనే జరగాలని, రాజకీయ నేతల జోక్యం అం దులో ఉండకూడదని ముఖ్యమంత్రి అన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top