వీడుతున్న ముడులు!

వీడుతున్న ముడులు! - Sakshi


డాక్టర్ కాల్పుల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

తెరపైకి కొత్త పేరు.. ప్రియాంక

ఉదయ్‌కుమార్ తరఫున పలువురి నుంచి అప్పులు

3 నెలల క్రితమే సిగ్మా ఆసుపత్రిని లీజుకు తీసుకున్న శశి

అక్కడ కూడా లావాదేవీలపై నడుస్తున్న వివాదం




సాక్షి, హైదరాబాద్: డాక్టర్ కాల్పుల కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. హత్యాయత్నం, ఆత్మహత్య కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రధానంగా తమ అనుమానాల నివృత్తిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. శశికుమార్ సూసైడ్‌నోట్‌లో చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రియాంక అనే కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఉదయ్‌కుమార్ తరఫున పలువురు ఫైనాన్షియర్ల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది.


 సిగ్మా ఆసుపత్రిలో రూ.1.3 కోట్ల వివాదం

సూసైడ్‌నోట్‌లో శశికుమార్.. ఉదయ్, సాయిలతో పాటు కేకేరెడ్డి, రామారావు, ఓబుల్‌రెడ్డి, చిన్నారెడ్డి పేర్లను రాశారు. వారంతా తనను మోసం చేశారని, శిక్షపడేలా చూడాలన్నారు. దీంతో వీరికి లారెల్ ఆసుపత్రి వ్యవహారాలతో సంబంధం ఉందని అనుమానించిన పోలీసులు లోతుగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆస్పత్రికి సంబంధించి మరో వివాదం ఉన్నట్లు బయటపడింది. దీన్ని మూడు నెలల క్రితం శశికుమార్ లీజుకు తీసుకున్నారు. కేకే రెడ్డిగా పిలిచే కృష్ణకిషోర్‌రెడ్డి ఈ ఆసుపత్రి మాజీ డెరైక్టర్. ఆయన వద్ద నుంచే శశి దీన్ని లీజుకు తీసుకున్నారు.


ఈ వ్యవహారాలకు సంబంధించి వీరిద్దరి మధ్య రూ.1.3 కోట్లకు సంబంధించి వివాదం నడుస్తోంది. రామారావు ఈ ఆసుపత్రికి సీఈఓగా వ్యవహరించగా... చిన్నారెడ్డి ఆసుపత్రి బిల్డింగ్ యజమానిగా తేలింది. ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి శశికుమార్‌కు సహాయకుడి (పీఏ)గా పని చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురినీ విచారించిన పోలీసులు వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన ముగ్గురితోనూ శశికుమార్‌కు ఆర్థిక వివాదాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. మరోవైపు కారులో కాల్పులు జరిపిన వ్యక్తి.. వెనుక సీటులో కూర్చున్నట్లు ఇప్పటికే తేలింది. అయితే అక్కడ కూర్చున్నది శశికుమారా? సాయికుమారా? అన్నది తేల్చడానికి కాఫీ షాప్‌తో పాటు మరో రెండు ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరించి విశ్లేషించారు. వీటి ఆధారంగా వెనుక సీటులో కూర్చున్నది శశిగా నిర్ధారించారు.


 కారు, బ్రీఫ్‌కేస్ శశి కుటుంబీకులకు అప్పగింత

హిమాయత్‌నగర్‌లోని మినర్వా కాఫీ షాప్ వద్ద స్వాధీనం చేసుకున్న శశికుమార్ కారును.. నారాయణగూడ పోలీసులు గురువారం ఆయన కుటుంబీకులకు అప్పగించారు. కారుతోపాటు అందులోని బ్రీఫ్‌కేస్, చెక్కు పుస్తకాలు ఇతర వస్తువుల్ని అందజేశారు. అందులో లభించిన 14 తూటాలతోపాటు రివాల్వర్ లెసైన్సును సీజ్ చేశారు. ఉదయ్‌కుమార్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన నుంచి మరోసారి పూర్తిస్థాయి వాంగ్మూలం నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.


లారెల్ ఆసుపత్రికి ఫైనాన్షియర్ల క్యూ

మాదాపూర్‌లో లారెల్ ఆసుపత్రి ఏర్పాటుకు ముగ్గురు డాక్టర్లు రూ.15 కోట్లకు పైగా పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసింది. ఈ మొత్తంలో అత్యధికం వాటాదారులతో పాటు ఫైనాన్షియర్లకు చెందినదిగా సమాచారం. కాల్పుల వివాదం కాస్త సద్దుమణగటంతో గురువారం నంచి ఆసుపత్రికి పలువురు ఫైనాన్షియర్లు వచ్చి వెళ్తున్నారు. తమ పెట్టుబడికి సంబంధించి వాటా ఇస్తామన్నారని, ఇప్పుడు ఎవరు జవాబుదారీ అంటూ అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక అనే మరో పేరు వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌కుమార్‌కు స్నేహితురాలిగా చెప్పుకున్న ఈమె.. ఆయన తరఫున మధ్యవర్తిగా ఉండి పలువురు ఫైనాన్షియర్ల నుంచి భారీ మొత్తాలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆచూకీ లభించట్లేదని, సెల్‌ఫోన్ సైతం స్విచ్ఛాఫ్‌లో ఉందని ఓ ఫైనాన్షియర్ ఆరోపించారు. దీంతో ఆమె ఎవరనే అంశాన్నీ పోలీసులు పరిగణనలోకి తీసుకుని ఆరా తీస్తున్నారు.


ఆ రోజు ఏం జరిగింది?

డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిగిన రోజు సోమవారం సాయంత్రం 6 గంటలకు చంద్రకళ శశికుమార్‌ను మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో వదిలి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాత్రి 9 గంటల సమయంలో ఫామ్‌హౌస్‌కు వచ్చి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 9 గంటల సమయంలో ఓ వాహనం ఫామ్‌హౌస్ వద్దకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. అయితే ఆ వాహనంలో చంద్రకళ వచ్చిందా? లేక మరెవరైనా వచ్చారా? అన్నది స్పష్టంగా తెలియదని పేర్కొంటున్నారు.


 కాల్చిన చప్పుడేమీ వినిపించలేదు: శంకరయ్య, ఫామ్‌హౌస్ వాచ్‌మెన్

‘‘సోమవారం సాయంత్రం 6 గంటలకు చంద్రకళ మేడమ్, శశికుమార్ సార్ కార్లో వచ్చారు. వారు మామూలుగానే ఉన్నారు. ఎలాంటి ఆందోళన కనిపించలేదు. సార్ రాత్రి ఇక్కడే ఉంటారు.. భోజనం ఏర్పాటు చేయాలని మేడమ్ చెప్పింది. ఆమె కార్లోనే నక్కలపల్లి గ్రామం వరకు వెళ్లాను. మా ఇంట్లోనే బగారా అన్నం, చికెన్ కూర వండుకుని రాత్రి 8 గంటలకు తీసుకెళ్లాను. అప్పటికి సారు మందు తాగుతున్నాడు. చికెన్ తినమని ప్లేట్‌లో వేసి ఇచ్చాను. నేను మందు తాగి తింటాను.. నువ్వు వెళ్లి పడుకో అని సార్ చెప్పాడు. నేను గేటు దగ్గర ఉన్న గదిలో పడుకున్నాను. గన్‌తో కాల్చిన చప్పుడేమీ వినిపించలేదు. గతంలో శశికుమార్‌ను మేడమ్ ఎప్పుడూ ఫాంహౌస్‌కు తీసుకురాలేదు. ఇదే మొదటిసారి’’

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top