తెలంగాణలో రైతు రాజ్యం: ఎంపీ బూర

తెలంగాణలో రైతు రాజ్యం: ఎంపీ బూర


సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తెలంగాణ రైతు రాజ్యంగా అవతరిస్తోందని భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ 16వ ఆవిర్భావ సభ (ప్రగతి నివేదన సభ )కు సకల జనుల సమ్మెను మరిపించే రీతిలో స్పందన వస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయం లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.


ఎన్నికల హామీకి కట్టుబడి రూ. 17 వేల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేయడమే కాకుండా, వచ్చే సంవత్సరం నుంచి ఉచిత ఎరువుల సరఫరాకు నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని కితాబిచ్చారు. కొన్ని పార్టీలు ఈ ఏడాది నుంచే ఉచిత ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని డిమాండ్‌ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉచిత ఎరువుల నిర్ణయం రాష్ట్ర రైతాంగానికి కొత్త ఊపిరి ఇచ్చిందన్నారు. వరంగల్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభకు రైతులు స్వచ్ఛందంగా, పెద్ద సంఖ్యలో హాజరై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపాలని ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top