ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు - Sakshi


కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి వ్యాఖ్య

పన్ను ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం అందిస్తున్నందువల్ల

హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు

విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉంది

14వ ఆర్థిక సంఘం హోదా రాష్ట్రాలకు,

సాధారణ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదు

రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ

కోరం లేక అసంపూర్తిగా ముగిసిన వైనం


 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి తేల్చిచెప్పారు. విభజన చట్టం అమలు చేయడమే కాకుండా పన్ను ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం అందిస్తున్నందువల్ల ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చకు జవాబిచ్చిన తర్వాత పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నీతి ఆయోగ్ పన్నుల హాలిడే, పన్నుల ప్రోత్సాహకాలు అందించింది. అభివృద్ధి కోసం కేంద్రం పూర్తిగా నిధులందించింది.


అందువల్ల ప్రత్యేక హోదా అవసరం  లేదనిపిస్తోంది. ప్రైవేట్ మెంబర్ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్ చే శారు. మీకు కావాల్సినవి చట్టంలో ఉన్నాయని (ప్రత్యేక హోదా చట్టంలో లేదని పరోక్షంగా చెబుతూ) వారికి చెప్పాను. చట్టం అమలు పురోగతిని వివరించాను’ అని చౌదరి వెల్లడించారు. అంతకుముందు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి జవాబిచ్చారు.


ప్రత్యేక హోదా ప్రస్తావన తేకుండా విభజన చట్టం అమలులో పురోగతిని వివరించారు. చట్టంలో పేర్కొన్న  హామీలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు జేడీ శీలం స్పష్టత కోరగా.. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపలేదని పేర్కొన్నారు.


 2018 కల్లా పోలవరం పూర్తి

ఏపీకి పన్నుల ప్రోత్సాహకాలు, కేంద్ర సాయం గురించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని చౌదరి పేర్కొన్నారు. ‘చట్టంలోని అంశాల అమలు కోసం కమిటీలు వేశాం. సమీక్షలు జరుపుతున్నాం.ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థలు ఏర్పాటయ్యాయి. కేంద్రీయ వర్సిటీకి భూసేకరణ జరుగుతోంది. పనుల పురోగతిని బట్టి నిధులు ఇస్తాం. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన రూ.7 వేల కోట్లను ఇస్తాం. 2018 కల్లా పూర్తి చేస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.2,050 కోట్లు అందించాం. త్వరలోనే ఏపీలో నూతన హైకోర్టు ఏర్పాటవుతుంది..’ అని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ తెలుగు రాష్ట్రాలలో నెరవేరుస్తామన్నారు.మరోసారి హోదాపై సభ్యులు పట్టుబట్టగా.. టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్ కోరం లేదంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది. తదుపరి వారంలో ఈ చర్చ కొనసాగనుంది.


తెలంగాణాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి: కేశవరావు

ఏపీతో పాటు తెలంగాణాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్థానాలు పెంచాలని  తెలుగుు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారని గుర్తుచేస్తూ అసెంబ్లీ స్థానాలు పెంచే దిశగా కేంద్రం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు విభజన చట్టం అమలుకు ఎందుకు ప్రయత్నించడం లేదని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ నిలదీశారు.  మోదీ చెప్పిన మంచి రోజులు ఎప్పడొస్తాయని ప్రశ్నించారు. విభజన చట్టం అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు.  కేంద్ర మంత్రి జవాబు తర్వాత కేవీపీ వివరణ కోరాల్సిన సమయంలో సభలో కోరం లేకపోవడంతో చర్చ అసంపూర్తిగా ముగిసింది.


కేంద్రానికి చిత్తశుద్ధి లేదు: జేడీ శీలం

అంతకుముందు చర్చలో పాల్గొంటూ విభజన చట్టం అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు, తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని జేడీ శీలం ఆరోపించారు. విభజన చట్టం అమలు విషయంలో కేంద్రానికి  చిత్తశుద్ధి లేదన్నారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మట్టి, నీరు తెచ్చి ఏపీ ప్రజలను అవమానపర్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదని కుంటిసాకులు చెబుతున్నారని, 11 రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కల్పిస్తేనే ఏపీలో అభివృధ్ది సాధ్యమవుతుందన్నారు.  విభజన చట్టం అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంలేదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top