విద్యుత్ సమస్యను రాజకీయం చేయొద్దు


‘విద్యుత్ సంక్షోభం’ సదస్సులో వక్తలు

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశంలో హరిత విప్లవం రావాలంటే సమృద్ధిగా నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్  డాక్టర్ అశోక్‌రావు అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  ‘తెలంగాణ అభివృద్ధి-విద్యుత్ సంక్షోభం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అశోక్‌రావు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ బోర్డులు గ్రీన్ రెవల్యూషన్‌కోసం చేసిన కృషిని ఎవరూ గుర్తించలేదని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను రాజకీయం చేస్తున్నారేగానీ పరిష్కరించడంలేదన్నారు.



ప్రైవేటీకరణ వల్ల పెద్ద మొత్తంలో నష్టాలు జరిగాయని అన్నారు. కొత్త చట్టాల వల్ల ప్రజలకు నష్టమే ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయన్నారు. విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, దీనికి ప్రధాన కారణం ఖరీఫ్ పంట ఆలస్యంగా రావడం, ఎయిర్ కండీషన్ల వినియోగం తీవ్రంగా పెరగడమని అన్నారు. రాష్ట్రంలో వనరులు ఉన్నప్పటికీ విద్యుత్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదని, ఎక్కువ భాగం ఆంధ్రాకు తరలి వెళ్లాయని స్పష్టం చేశారు.



ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వల్ల తెలంగాణకు రావాల్సిన 54 శాతం వాటా రావడం లేదన్నారు. అలాగే 500 మెగావాట్ల గాలిమరల విద్యుత్ ఆగిపోయిందని, కృష్ణపట్నం నుంచి 400 మెగావాట్లు, విజయవాడ, రాయలసీమ థర్మల్ పవర్  కేంద్రాల నుంచి రావాల్సిన విద్యుత్ తక్కువగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 20 మిలియన్ల యూనిట్‌ల వరకు నష్టపోతున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాలకు విద్యుత్ పంచుతామన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. కేంద్రం చొరవ చూపి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.



తెలంగాణ ప్రభుత్వం 6 నెలల వ్యవధిలో 3 వేల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన కోరారు. భూపాల్‌పల్లి, సింగరేణి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి,  టి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top