ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు వద్దు


సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు వద్దని ప్రొఫెసర్, రచయిత కంచె ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్న తరుణంలో ఇంటర్వ్యూలు నిర్వహించకుండా రాతపరీక్ష ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంచె ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసిన యువత.. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందని, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.



ఇటీవల కాలంలో తాను రాసిన వ్యాసం ఓ దినపత్రికలో ప్రచురిమైందని, ఆ వ్యాసం కొంతమందికి ఇబ్బందికరంగా ఉందని తనపై కుట్ర పూరితంగా ప్రభుత్వం కేసు నమోదు చేయించిందని ఆరోపించారు. ఈ కేసు విషయంలో తనకు ఊరట కల్పించడంపై న్యాయవ్యవస్థకు, అండగా నిలిచిన పలు రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పరిశోధన రంగంలో ఉన్న రచయితపై ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై విచారణ వ్యక్తం చేశారు. తెలంగాణలో రచయితలు, మీడియా, కళాకారులు, గాయకులకు భావస్వేచ్ఛ ఏ విధంగా ఉండాలనే నియమ నిబంధనలను ప్రకటించి, ఆయా రంగాలకు సలహాలు, సూచనలు చేసేందుకు ఓ కమిటీని వేయాలని కంచె ఐలయ్య ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top