ఏదీ అనుసం‘దానం?’

ఏదీ అనుసం‘దానం?’ - Sakshi

  •      హైదరాబాద్ నగర కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం

  •      పార్టీని నడిపించే నాయకుల కోసం ఎదురుచూపు

  • హైదరాబాద్‌: ఓ వైపు ముంచుకొస్తున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు.. మరో వైపు అంటీ ముట్టనట్లుగా పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ వ్యవహారంతో నగర కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంతో నగరమంతటా విజయం సాధించిన పార్టీ 2014 ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మెజారిటీ చోట్ల మూడోస్థానానికి పడిపోయింది. పోయిన పరువుతో పాటు మళ్లీ విజయతీరం చేర్చే నాయకుల కోసం పార్టీ వెతుకుతోంది.



    అధికారంలో ఉన్న సమయంలో అన్నీ తామై వ్యవహరించిన మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్‌గౌడ్‌లు ఏడాదిన్నర కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరమై సొంత పనుల్లో బిజీ అయ్యారు. దానం అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటూ... అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న తీరు పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. దీంతో త్వరలోనే పీసీసీ, సీఎల్పీ నాయకులను కలిసి గ్రేటర్‌కు పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేసే అవకాశం ఉంది.

     

     దానం..అయోమయం

     టీఆర్‌ఎస్ నుంచి రాని క్లియరెన్స్

    కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్ ఒకింత అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా క్రియాశీలకంగా వ్యవహరించలేక... మరో వైపు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ముహూర్తం ఖరారు కాక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే నగర మంత్రులు తలసాని, పద్మారావులతో పాటు టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న హరీష్‌రావు, కేటీఆర్‌లతో దానం పలుమార్లు భేటీ అయినట్లు తెలిసింది.


    పార్టీలోకి తీసుకునేందుకు సూత్రప్రాయంగా అంగీరించినప్పటికీ... ఏ హోదా కల్పించాలన్న అంశం అధినేత కేసీఆర్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పడంతో ఆయన అటూ ఇటూ కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. నగర మేయర్ లేదా ఎంఎల్‌సీ పోస్టుల్లో ఏదైనా ఒకటి తనకు కేటాయిస్తే గౌరవప్రదంగా ఉంటుందన్న ప్రతిపాదనను టీఆర్‌ఎస్ ముఖ్య నేతల ముందుంచినట్లు సమాచారం.

     

    బీజేపీ వైపు.. ముఖేష్ చూపు

    నగర కాంగ్రెస్‌లో మరో ముఖ్య నాయకుడు మూల ముఖేష్ గౌడ్ బీజేపీలో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటి వరకూ ప్రకటించనప్పటికీ... సనత్‌నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు గతంలో విజ్ఞప్తి చేశారు.



    మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరే అంశాన్ని కూడా ముఖేష్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తన సోదరుడు, మాజీ కార్పొరేటర్ మధుగౌడ్  ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన చేరికను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యతిరేకించినప్పటికీ పార్టీ ఖాతరు చేయలేదు. అదే దారిలో ముఖేష్‌గౌడ్ బీజేపీలో చేరేందుకు సంకేతాలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top