కవర్ లెటర్ అంటే తెలుసా?

కవర్ లెటర్ అంటే తెలుసా? - Sakshi


ఉద్యోగానికి దరఖాస్తు చేసే విషయంలో చాలా మంది అభ్యర్థులు కేవలం రెజ్యుమెపైనే దృష్టి సారిస్తుంటారు. కానీ, అంతకంటే ముఖ్యమైన కవర్ లెటర్‌ను విస్మరిస్తుంటారు. కొలువు వేటలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, కవర్ లెటర్ అంటే ఏమిటి? ఇది ఎలా ఉండాలి? ఇందులో ఏయే అంశాలను పొందుపర్చాలి? అనే దానిపై ఎక్కువ మందికి అవగాహన ఉండదు. కొలువుకు దరఖాస్తు చేసేటప్పుడు రెజ్యుమెతోపాటు కవర్ లెటర్‌ను కూడా జతచేయాల్సి ఉంటుంది. రిక్రూటర్లు రెజ్యుమె కంటే ముందు కవర్ లెటర్‌నే చూస్తారు. ఇందులోని సమాచారాన్ని బట్టి అభ్యర్థిపై ఒక అంచనాకు వస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి రెజ్యుమెను పరిశీలిస్తారు. అంటే.. కవర్ లెటర్ సరిగ్గా ఉంటేనే రెజ్యుమె రిక్రూటర్ చేతిలోకి వెళ్తుంది. దీన్నిబట్టి ఈ లెటర్ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

 

కవర్ లెటర్ ఎలా ఉండాలి?



ఈ విషయంలో పొదుపు పాటించడమే మంచిది. దీన్ని కేవలం ఒకే పేజీకి పరిమితం చేయాలి. అంతకంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సుదీర్ఘంగా ఉంటే దాన్ని చదవడానికి రిక్రూటర్‌కు విసుగ్గా అనిపిస్తుంది. పూర్తిగా చదవకుండా పక్కన పడేసేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి క్షుప్తంగా ఒకే పేజీలో ఉండడం మేలు. రెజ్యుమెలోని అంశాలను ఇందులో రేఖామాత్రంగా పరిచయం చేయాలి. అభ్యర్థి తన అర్హతలను, అనుభవాలను, ఇతర విషయాలను సంక్షిప్తంగా ప్రస్తావించాలి. అదేసమయంలో ముఖ్యమైన సమాచారం మాయం కాకుండా జాగ్రత్తపడాలి.

 

 ఏయే అంశాలుండాలి?



కవర్ లెటర్ ద్వారా అభ్యర్థి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని రిక్రూటర్ ఆశిస్తారు. వాటిని సక్రమంగా తెలియజేయడం అభ్యర్థి బాధ్యత. సదరు సంస్థలో ఉద్యోగం ఖాళీగా ఉన్నట్లు ఎలా తెలిసిందో కవర్ లెటర్‌లో పేర్కొనాలి. అంటే ఏ మాధ్యమం ద్వారా తెలిసిందో చెప్పాలి. కొలువుకు న్యాయం చేసేవారి కోసమే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంటారు. అభ్యర్థి తన అర్హతలను, పని అనుభవాన్ని వివరించాలి.  తన అనుభవం సంస్థ అభివృద్ధికి కచ్చితంగా ఉపయోగపడుతుందనే భావన కవర్ లెటర్ ద్వారా కలిగించాలి. ఈ ఉద్యోగంపై అభ్యర్థికి నిజంగా ఆసక్తి ఉందా? అని రిక్రూటర్ అనుమానిస్తుం టారు. దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేసేందుకు ఆ కంపెనీని బెస్ట్‌ప్లేస్‌గా భావిస్తున్నట్లు స్పష్టం చేయాలి. ఎందుకు అలా భావిస్తున్నారో కూడా చెప్పాలి. కవర్ లెటర్‌లో ఉపయోగించే భాష విషయంలో అప్రమత్తత పాటించాలి. మర్యాద ఉట్టిపడే భాషను ఉపయోగించాలి. అందులో ఉత్సాహం, ఆసక్తి కనిపించాలి. అభ్యర్థి శైలి ఆహ్లాదకరంగా ఉంటే రిక్రూటర్ మనసును గెలుచుకోవచ్చు.

 

వేతనం గురించి అడగాలా?




కంపెనీ నుంచి ఎంత వేతనం ఆశిస్తున్నారనే విషయాన్ని కవర్ లెటర్‌లో ప్రస్తావిస్తే.. మీరు ముక్కుసూటి మనిషి అని భావించే అవకాశం ఉంది. డబ్బుపై మీకు ఎక్కువ ఆశ ఉన్నట్లు రిక్రూటర్ అంచనాకు రాకూడదు అనుకుంటే.. కవర్ లెటర్‌లో దీన్ని వదిలేయాలి.  

 

 రాయకూడనిదేమిటి?




నేను ఫలానా కారణంతో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను, నా సమస్యలు, ఇబ్బందులు ఇవి.. అంటూ ప్రతికూలమైన విషయాలను కవర్ లెటర్‌లో రాయకూడదు. ఇలాంటి వాటిని వీలుంటే ఇంటర్వ్యూలో మాత్రమే చర్చించాలి. సరిగ్గా తీర్చిదిద్దిన కవర్ లెటర్ ఉద్యోగ సాధనలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఇందులో రాసే అంశాలపై జాగ్రత్త వహిస్తే కొలువు సొంతమవుతుంది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top