అరుదైన అమ్మ... ఎంత కష్టమమ్మా!

అరుదైన అమ్మ... ఎంత కష్టమమ్మా!


అనగనగా ఓ అమ్మ. కొన్నేళ్ల క్రితం విధులకు వెళ్తున్న ఆమెకు చెత్త కుండీలో ఓ శిశువు కనిపించింది. ‘నాకెందుకులే’ అనుకోకుండా అక్కున చేర్చుకుంది. తన వారి వల్ల ఆ చిన్నారికి కష్టాలు ఎదురు కాకూడదని భావించి.. దత్తత తీసుకుంది. కన్నకొడుకు కంటే... పెంచిన కుమార్తెనే మిన్నగా భావించింది. ఆ బిడ్డ ఇప్పుడు అడ్డం తిరిగింది. అమ్మ గుండెను గాయపరుస్తోంది. జీవితాన్నిచ్చిన తల్లిని  జీవశ్చవంలా మారుస్తోంది.

 

 బంజారాహిల్స్:

ఒకరిది ప్రేమానురాగం.. ఇంకొకరిది ధనదాహం. ప్రాణానికి ప్రాణంగా.. అమ్మలోని మమకారాన్ని పంచి.. అల్లారు ముద్దుగా పెంచి... విద్యాబుద్ధులు నేర్పించి.. పెళ్లి చేసిందా తల్లి. బదులుగా వృద్ధాప్యంలో ఉందనే కనికరం కూడా లేకుండా ఆస్తికోసం ఆమెకు ప్రత్యక్ష నరకాన్నే చూపించిందా కూతురు. తీరా చూస్తే... ఈ కూతురు ఆమెకు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ కాదు. చెత్తకుండీ వద్ద దొరికిన పసికందు. అయినా దత్తత తీసుకొని అపురూపంగా చూసుకున్న తల్లి పాలిట ఇప్పుడు ఆ దత్తపుత్రికే యమపాశంగా మారింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

 

ఇదీ కథ...

జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10సీలోని వెంకటగిరిలో నివసించే అమ్మినీయమ్మ(74) నీలోఫర్ ఆస్పత్రి సమీపంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేసి రిటైర్ అయ్యింది. 1992లో ఓ రోజు ఆస్పత్రిలోడ్యూటీకి వెళ్తుండగా గేటు వద్ద చెత్తకుండీలో క్యార్.. క్యార్‌మంటూ ఏడుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా ఇంకా రక్తపుమరకలు ఆరని అప్పుడే పుట్టిన శిశువు గుక్క పెట్టి ఏడుస్తుండటం చూసింది. అమ్మ మనసు కరిగింది. వెంటనే ఆ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లి సహచర నర్సులు సారా, సరోజతో కలిసి స్నానం చేయించి వైద్యం అందించి పాలుపట్టించింది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకొని సేవలందించింది. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంది.

 

మూడేళ్లప్పుడు అధికారికంగా ఆ పాపను దత్తత తీసుకొని దివ్య అని పేరు పెట్టుకుంది. ఖరీదైన ప్రైవేట్ స్కూల్‌లో చదివించింది. యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ చదివించింది. అదే సమయంలో దివ్య ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోగా అమ్మినీయమ్మ తన కూతురు కనిపించడం లేదంటూ అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పారిపోయి పెళ్లి చేసుకున్న దివ్య, ఆమె భర్త రమేష్‌ను పట్టుకొని తల్లికి అప్పగించారు. అప్పటి నుంచే అమ్మినీయమ్మకు కష్టాలు మొదలయ్యాయి. వెంకటగిరిలో 400 గజాల విస్తీర్ణంలో కట్టుకున్న మూడంతస్తుల ఇల్లును తనపేరు మీద రాయాలంటూ దివ్య పోరు ప్రారంభించింది.

 

 నిత్యం అమ్మినీయమ్మను శారీరకంగా, మానసికంగా వేధించేది. బాధలు భరించలేక కూతురికి ఒక అంతస్తు రాసిచ్చినా ఆమె దాహం తీరలేదు. మొత్తం ఇంటిని రాసివ్వాలంటూ ఇటీవల తిట్టడం, కొట్టడం కూడా చేస్తుండడంతో బాధలు భరించలేక కూతురిపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీనియర్ సిటిజన్స్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దివ్య, ఆమె భర్త రమేష్‌లను స్టేషన్‌కు పిలిపించారు. తన కన్న కొడుకును సరిగ్గా చూడకుండా దత్తత తీసుకున్న దివ్యను కన్నవాళ్ల కంటే ఎక్కువగా చూశానని ఇంతా చేస్తే ఇప్పుడు నరకాన్ని చూపిస్తున్నదని అమ్మినీయమ్మ పోలీసులకు చెప్పింది. ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులలో హెడ్‌నర్స్‌గా పని చేసి రిటైర్ అయిన అమ్మినీయమ్మది కేరళ. భర్త 1972లోనే చనిపోగా కొడుకు వేణు తాగుడుకు బానిసై పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి దివ్యనే కొడుకుగా భావించి అల్లారుముద్దుగా చూసుకుంటుండగా చివరకు ఆమెకే నరకాన్ని చూపిస్తున్నదని ఆరోపించింది.

 

ఇటీవల దత్త పుత్రిక బాధలు భరించలేక కిందపడగా కోమాలోకి వెళ్లి నెల రోజుల తర్వాత స్పృహలోకి వచ్చినట్లు తెల్పింది. అనంతరం నాలుగు తెల్లకాగితాల మీద బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆ తల్లి ఆరోపించింది. ఆస్పత్రి ఆవరణలో చెత్తకుండీలో దొరికిన గంటల శిశువును చేరదీసి పెంచి పెద్దచేస్తే చివరకు ఆ వృద్ధురాలికి ఆ కూతురే ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్న వైనాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. పెంచుకున్న కూతురు మోజులో కన్న కొడుకును, కోడలును, మనవరాళ్లను వదిలేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది ఆ వృద్ధురాలు. తాను ఒంటరిగా ఉంటానని కూతురి పోరు లేకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top