నరరూప రాక్షసులు...

నరరూప రాక్షసులు... - Sakshi


హైదరాబాద్ :  కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే నరరూప రాక్షసులుగా మారారు.  బాలికను మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు సోమవారం నారాయణగూడలోని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బాధిత బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఇందిరానగర్‌కు చెందిన జ్యోతిరాణి, శ్రీనివాస్‌ల కూతురు (13) లాలాగూడలోని హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. తండ్రి ఆటో డ్రైవర్. తల్లిదండ్రులు మద్యానికి బానిసై బాలికను స్కూల్ మాన్పించి కొద్దిరోజులు పనిలో చేర్పించారు.

 

చిన్నారితో మద్యం తెప్పించుకుని, ఆమెతోనే గ్లాసుల్లో పోయించుకొని తాగేవారు. తండ్రి  శ్రీనివాస్ లైంగికదాడికి పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన కన్నతల్లే అతడికి మద్దతు తెలుపుతూ బాలికను చిత్రహింసలకు గురి చేసేది. తరచూ దుర్భాషలాడుతూ హింసించేది. తండ్రితో బాలికను కొట్టించేంది. బాలికను చంపేందుకు ఒకసారి బస్సు కిందకు నెట్టేందుకు యత్నించింది. దీంతో తల్లిదండ్రుల వద్ద ఉంటే తనను చంపేస్తారని భావించిన చిన్నారి తనకు ప్రభుత్వం ద్వారా రక్షణ కల్పించాలని కోరుతూ బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. అమ్మమ్మ లేదా పెద్దమ్మ వద్ద ఉంటానని, అందుకు ఏర్పాట్లు చేయాలని వేడుకుంటోంది.

 

బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సహాయంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో తన తల్లిదండ్రుపై బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల సంఘం   అధ్యక్షుడు అచ్యుతరావు మాట్లాడుతూ... బాలికను వేధిస్తున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయించామని, వారికి శిక్షపడేందుకు కృషి చేస్తామన్నారు. ముందుగా బాలికకు రక్షణ కల్పించి, చదువుకునేందుకు అవకాశాలు కల్పిస్తామన్నారు.  బాధితురాలిని రంగారెడ్డి జిల్లా ఐద్వా ఉపాధ్యక్షురాలు నన్నపనేని సృజన కలిసి పరామర్శించారు. బాలిక తల్లిదండ్రలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top