తండ్రి..కొడుకు.. ఓ బంధువు

తండ్రి..కొడుకు.. ఓ బంధువు - Sakshi


ఘరానా దొంగల ముఠా అరెస్టు

ఆరు బయట నిద్రించే మహిళలే టార్గెట్‌

మంగళసూత్రాలు, బంగారు ఆభరణాల చోరీ

సైబరాబాద్‌ పోలీసుల అదుపులో నిందితులు




సాక్షి, సిటీబ్యూరో: తండ్రి...కొడుకు...ఓ సమీప బంధువు..సినిమా టైటిల్‌ అనుకుంటున్నారా...కాదండీ సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మహబూబ్‌నగర్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో దాదాపు 13 నేరాలకు పాల్పడ్డ  వీరి నుంచి రూ.13 లక్షల విలువైన 45 తులాల బంగారునగలను స్వాధీనం చేసుకున్నారు.. మంగళవారం సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సందీప్‌శాండిల్య, జాయింట్‌ సీపీ షానవాజ్‌ ఖాసీ వివరాలు వెల్లడించారు.



చోరీల్లో కుమారుడికి శిక్షణ...

నాగర్‌కర్నూలు జిల్లా పుల్లగిరి తుప్డా తండాకు చెందిన ముడావత్‌ కిషన్‌ 25 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు.  మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ నగరాల్లో జరిగిన చోరీ కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లివచ్చినా అతని వైఖరిలో మార్పురాకపోగా,  కుమారుడిని సైతం తన వృత్తిలోకే దించాడు. ఇందుకుగాను తన కుమారుడు శ్రీనుకు చోరీల్లో శిక్షణ ఇచ్చాడు. తమ సమీప బంధువైన బాజీపూర్‌ పెద్ద తండాకు చెందిన పత్లావత్‌ రామ్లతో కలిసి ముఠాగా ఏర్పడి దారి దోపిడీలు, చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవారు.

 

మహిళలే టార్గెట్‌...

ఈ ముఠా సభ్యులు ఎంపికచేసుకున్న గ్రామాల్లో ముందుగానే రెక్కీ నిర్వహించేవారు. ఒంటిపై బంగారం ధరించి ఆరుబయట నిద్రిస్తున్న మహిళలను గుర్తించేవారు. రాత్రివేళల్లో వీరు ముగ్గురు ఒకే బైక్‌పై ఎంచుకున్న ఇంటికి వెళ్లేవారు. వారిలో ఒకరు బైక్‌పై సిద్ధంగా ఉండగా, మరొకరు గేటు వద్ద కాపలా కాసేవాడు. మరొకరు లోపలికి వెళ్లి మహిళ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొచ్చేవాడు. బాధితులు తిరగబడితే దాడి చేసేందుకు సైతం వెనకాడేవారు కాదు. ఈ ముఠా సభ్యులు సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని పలుగ్రామాల్లో పంజావిసరడంతో అప్రమత్తమైన సీపీ సందీప్‌ శాండిల్యా ఆదేశాల మేరకు శంషాబాద్‌ డీసీపీ పద్మజా నేతృత్వంలో షాద్‌నగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం కేశంపేటలో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాలు అంగీకరించారు.



పీడీ యాక్ట్‌ నమోదుకు చర్యలు..

నిందితులపై షాబాద్‌లో నాలుగు, చేవేళ్ల, కేశంపేటలో నాలుగు, శంషాబాద్‌లో ఒకటి,  మహేశ్వరంలో నాలుగు దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి.   తండ్రీ కొడుకులపై ఐదు నాన్‌ బెయిలెబుల్‌ వారంట్లు కూడా ఉన్నందున వీరిపై పీడీ యాక్ట్‌ నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్‌సీపీ  తెలిపారు. చాకచాక్యంగా నిందితులను పట్టుకున్న సిబ్బం దిని సీపీ సందీప్‌ శాండిల్యా అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు. సమావేశంలో క్రైమ్‌ డీసీపీ జానకీ షర్మిల, శంషాబాద్‌ డీసీపీ పద్మజ, రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవేళ్ల ఏసీపీలు గంగారెడ్డి, శ్రీనివాస్, శ్రుతకీర్తి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top