కరువుపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి

కరువుపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలి - Sakshi


 ప్రధాని మోదీని డిమాండ్ చేసిన సీపీఐ

 

 సాక్షి, హైదరాబాద్: దేశంలోని అనేక ప్రాంతాలు కరువు పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నా సహాయక చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  విఫలమయ్యాయని సీపీఐ జాతీయ కార్యవర్గం ధ్వజమెత్తింది. కేరళ పార్టీ కార్యదర్శి కె.రాజేంద్రన్ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైన రెండ్రోజుల పార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశంలో తొలిరోజు ఐదు తీర్మానాలు చేసినట్టు ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. వాటిని మీడియాకు విడుదల చేశారు. కరువుపై ప్రధాని మోదీ తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. బుందేల్‌ఖండ్‌కు ప్రత్యేక కరువు ప్యాకేజీని ప్రకటించాలని, కరువు పీడిత ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యూల్ చేయాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఉత్తరప్రదేశ్‌లో హిందూ మతోన్మాద సంస్థ బజరంగ్ దళ్ సాయుధ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోందని, వీటిని తక్షణమే నిలిపివేయించాలని డిమాండ్ చేసింది.



 హోదా హామీని తుంగలో తొక్కిన కేంద్రం: రామకృష్ణ

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆదివారం సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం గురించి కేంద్రం మర్చిపోయిందన్నారు. ప్రత్యేక హోదాపై పుస్తకాలు వేయించుకున్న వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా హామీపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మోదీ రెండేళ్ల పాలనపై గొప్పలు చెబుతున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top