డి‘స్కాం’!

డి‘స్కాం’! - Sakshi


డిస్కంలో అవినీతి దందా

ఆదాయం వచ్చే ప్రాంతాలపై దృష్టి

అధికారులకు భారీగా ముడుపులు

వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు

తాజాగా ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం ఏఈ అశోక్

 


సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీ ఎస్‌ఎస్‌పీడీసీఎల్) అక్రమార్కులకు నిలయంగా మారింది. ఏ పని చేయాలన్నా అధికారులు, సిబ్బందికి చేతులు తడపాల్సిందే. అపార్‌‌టమెంట్‌లకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలన్నా.... ఇంటి ముందు విద్యుత్ లైను వేయాలన్నా... ఇంటికి కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నా... చివరకు కాలిపోయిన మీటర్ మార్చాలన్నా...లైన్‌మెన్ దగ్గరి నుంచి డీఈ వరకు అందరికీ ఎంతో కొంత చెల్లించుకోవాల్సిందే. వినియోగదారులకు ఎంతో పారదర్శకంగా సేవలు అందించాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదనే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. పని చేసే ప్రాంతాలను ఫోకల్ (ఆదాయం వచ్చేవి), నాన్ ఫోకల్ (ఆదాయం అంతగా లేనివి) పోస్టులుగా విభజించి, వాటిని చేజిక్కించుకునేందుకు సంస్థలోని కొంత మంది‘పెద్ద’లకు భారీగా ముడుపులు ముట్టజెప్పుతున్నారు. ఈ మొత్తాన్ని మళ్లీ కూడబెట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.  కోర్ సిటీ  కంటే... కొత్త కనెక్షన్లు, లైన్లు అధికంగా అవసరం ఉన్న శివారు ప్రాంతాల్లో పని చేయడానికిఎక్కువ మొగ్గు చూపుతుండటానికి ‘అదనపు’ రాబడే కారణం.

 

తీరు మార్చుకోరు...

 అవినీతి ఆరోపణలతో పాటు వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటూ ఇప్పటికే పలువురు డీఈలు, ఏడీఈలు, ఏఈలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. అయినా మిగిలిన వారిలో మార్పు రావడం లేదు. హుస్సేన్‌సాగర్ ఎస్‌ఈగా పని చేసిన ఓ అధికారితో పాటు, మింట్ కంపౌండ్ ఏడీఈగా పని చేసిన మరో అధికారి.. వనస్థలిపురం ట్రాన్స్‌కో ఏడీ ఈలు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీకి పట్టుబడిన ఉదంతాలను సిటిజన్లు ఇంకా మరిచిపోలేదు. తాజాగా వనస్థలిపురం ప్రశాంత్ నగర్‌కు చెందిన కాంట్రాక్టర్ కర్రి వెంకటేశ్వరరావు ఇటీవల విద్యుత్ కనెక్షన్ (6 సింగిల్ ప్యానల్ బోర్డు) కోసం దరఖాస్తు చేసుకోగా... అంచనాల కోసం ఏఈ అశోక్ రూ.30 వేలు డిమాండ్ చేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చే సమయంలో చెల్లిస్తానని చెప్పిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం వారు వలపన్ని ఏఈని పట్టుకున్నారు.



అక్రమార్కులు గుండెల్లో రైళ్లు

ఆదాయానికి మించి ఆస్తులతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగుల్లో విద్యుత్ శాఖ రెండోస్థానంలో ఉండటం విశేషం. విద్యుత్ అధికారుల్లో చాలా మంది ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణ లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి ఇళ్లపై ఏసీబీ ఇటీవల వరుసగా దాడులు చేస్తోంది. ఇవి అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ అధికారి ఇంటిపై ఏసీబీ కన్ను పడుతుందోనని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కూడబెట్టిన ఆస్తులను ‘సంరక్షించే’ పనిలో పడుతున్నారు. తమ పేరుపై ఉన్న రూ.కోట్ల విలువైన ఆస్తులను బంధువులకు అప్పగిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top