అవినీతి టెండర్లే

అవినీతి టెండర్లే - Sakshi


సోలార్ టెండర్లపై నిజమైన ‘సాక్షి’ కథనం

- టెండర్లు రద్దు చేసిన ఏపీ జెన్‌కో.. కొత్తగా పిలిచే యోచన

- ఎన్టీపీసీ మార్గదర్శకాలకు భిన్నంగా టెండర్ల నిబంధనలు

- బీహెచ్‌ఈఎల్‌ను ముందుపెట్టి హైడ్రామా

- రూ. 755 కోట్ల కుంభకోణానికి సిద్ధం

- సాక్షి కథనంతో రంగంలోకి నిఘావర్గాలు

- అవినీతి నిజమేనని తేల్చిన నిపుణుల కమిటీ

 

 సాక్షి, హైదరాబాద్: సోలార్ టెండర్లలో అవినీతి  ఏరులై పారిందంటూ ‘సాక్షి’ కథనం అక్షర సత్యమైంది. ప్రజాధనాన్ని ఆరగించేందుకు సర్కారు సాక్షిగా జరిగిన ప్రయత్నం సాక్షి వార్తలతో పటాపంచలైంది. జెన్‌కో అధికారులు వేసిన నిపుణుల కమిటీలే టెండర్లలో అవినీతి ఉందంటూ నిగ్గుతేల్చడం, సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు రావడంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో సర్కారు వెన్నులో వణుకు పుట్టి విధిలేక టెండర్లను రద్దు చేసింది. ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 14న అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆధారాలతో సహా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. సమగ్ర దర్యాప్తుకు పట్టుబట్టి సభను స్తంభింపజేశారు.



సోలార్ టెండర్ల వ్యవహారంలో రూ. 755 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో సమాధానం చెప్పులేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోలార్ టెండర్లలో అవినీతే లేదంటూ బుకాయించారు. విపక్షం నిరూపిస్తే ఎంతకైనా సిద్ధమంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అయితే, ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. సోలార్ టెండర్ల కేసు కోర్టుకు వెళ్ళడంతో చంద్రబాబు సర్కారుకు భయం పుట్టుకొచ్చింది. నిపుణుల కమిటీ తప్పు జరిగిందని తేల్చడం, కోర్టులో తప్పిదాలన్నీ బయటకొస్తాయని ఆందోళనతో  విధిలేని పరిస్థితుల్లో సోలార్ టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.



ఈమేరకు టెండర్లు వేసిన వారికి వారం రోజుల క్రితం లేఖలు పంపినట్టు అధికారులు తెలిపారు. కొత్తగా టెండర్లు పిలుస్తామని వారు వివరించారు. అయితే, టెండర్ల వ్యవహారంపై చంద్రబాబు సర్కారు విచారణకు మాత్రం నిలబడలేదు. దీనివల్ల నిజాలు ఎక్కడ బయటకొస్తాయోనని వెనక్కు తగ్గింది.  ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని విజిలెన్స్ విభాగం సూచించినా, ఇదిలా ఉంటే, సోలార్ టెండర్ల రద్దు చేయడం అంటే అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఒప్పుకోవడమేనని, దీనిపై తప్పకుండా విచారణ జరగాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలా చేయకపోవడం చట్ట విరుద్ధమవుతుందని న్యాయనిపుణులు అంటున్నారు.



 ఈ కథనం పూర్వాపరాల్లోకి వెళ్తే...

 అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని తలారి చెర్వు వద్ద ఏపీ జెన్‌కో 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఒక్కొక్కటీ 100 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు ప్యాకేజీలుగా విడగొట్టింది. ప్యానల్స్ అమర్చడం, ఇతర పనులతో కూడిన (ఈసీపీ) కాంట్రాక్టులకు టెండర్లు పిలిచింది. కేవలం ఐదే ఐదు కంపెనీలు అర్హత పొందేలా ఏపీ జెన్‌కో పక్కా ప్రణాళికతో టెండర్ల అర్హత నిబంధనలు విధించింది. చాకచక్యంగా ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ను ముందుపెట్టారు. ఈ సంస్థ మెగావాట్‌కు రూ. 6.25 కోట్లు కోట్ చేసింది. ఆ తర్వాత వరుసలో ఉన్న మిగతా సంస్థలను రివర్స్ ఆక్షన్ పేరుతో ఇదే రేటుకు ఒప్పించారు. ముందే మాట్లాడుకున్న వ్యవహారం కావడంతో అంతా పకడ్బందీగా జరిగిపోయింది.



వాస్తవానికి ఇదే జిల్లాలో ఎన్టీపీసీ 750 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు టెండర్లు పిలిచింది. మెగావాట్ రూ. 4.91 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయి. ఈ లెక్కన చూస్తే ఏపీ జెన్‌కో మెగావాట్‌కు రూ. 1.34 కోట్లు అదనంగా చెల్లించేందుకు సిద్ధమైంది. అంటే రూ. 670 కోట్లు ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా ఇచ్చేందుకు సిద్ధపడింది. లోతుగా పరిశీలిస్తే ఇంకా పెద్ద మొత్తమే ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళే వీలుంది. ఎన్టీపీసీ రివర్స్ ఆక్షన్ చేపట్టేనాటికి డాలర్ మారకం విలువలోనూ తేడా ఉంది. జెన్‌కో భూమితో పోలిస్తే, ఎన్టీపీసీకి ఇచ్చిన భూమిని చదును చేసేందుకు అదనపు ఖర్చు అవుతుంది. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటే... జెన్‌కో సోలార్ కాంట్రాక్టు వ్యవహారంలో రూ. 755 కోట్లు అధికంగా ఉంటుందనేది సుస్పష్టం.



 సాక్షి కథనంతో తారుమారు

 ఈ ఏడాది జనవరి 25న సాక్షి ప్రచురించిన సోలార్ కుంభకోణం వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో సర్కారును నిలదీసింది. సమగ్ర విచారణకు పట్టుబట్టింది. ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందాయని ఆరోపించింది. ఈ దశలో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోయింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిపుణుల కమిటీని వేశారు. వాస్తవాలను పరిశీలించిన కమిటీ టెండర్లలో పేర్కొన్న నిబంధనలు కేవలం కొంతమందికి కాంట్రాక్టులు అప్పగించేందుకేనని నిగ్గు తేల్చినట్టు తెలిసింది.



► సోలార్ ఈపీసీ పనుల్లో పాల్గొనాలంటే 25 మెగావాట్ల సోలార్ ప్లాంట్ చేసి ఉండాలనేది ఎన్టీపీసీ నిబంధన. దీన్ని ఏపీ జెన్‌కో 50 మెగావాట్లకు పెంచింది. వార్షిక  టర్నోవర్ రూ. 300 కోట్లు ఉంటే సరిపోతుందని ఎన్టీపీసీ పేర్కొంటే, జెన్‌కో మాత్రం రూ. 800 కోట్లు ఉండాలని మెలిక పెట్టింది. నెట్‌వర్త్, లైన్‌ఆఫ్ క్రెడిట్ అర్హతలను ఎన్టీపీసీకి నిబంధనలకు విరుద్ధంగా ఏపీ జెన్‌కోనే నిర్ణయిం చింది.  ఈ అర్హతలన్నీ బీహెచ్‌ఈఎల్, స్టెర్లింగ్, టాటా, ఎల్ అండ్ టీతో పాటు మెగా సంస్థకు ఉండటంతో,  అవే ఎల్-1గా నిలిచాయి. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.

► అన్ని సంస్థలు పోటీ పడేలా ఎన్టీపీసీ నిబంధనలు పెట్టడం వల్ల 750 మెగావాట్ల సోలార్ ఈపీసీ టెండర్ల కోసం 17 సంస్థలు పోటీ పడ్డాయి. పుంజ్ లాయడ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ముంబయి), టెక్నో ఎలక్రిక్, విక్రమ్ సోలార్ (కలకత్తా), ఇన్‌డ్యూర్, ఎల్ అండ్ టి (చెన్నై), మహీంద్ర (ముంబయి), బీహెచ్‌ఇఎల్, టాటా, స్టెర్లింగ్ అండ్ విల్సన్, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్, వెల్‌స్పన్, మెగా ఇంజనీరింగ్, ఐసోలక్స్ స్పెయిన్, ఉజాస్ ఎంపీ, ఐసెక్, ఐసోలక్స్ ఇన్‌జెనీరియా (ఇండియా) మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇందులో 14 మంది అర్హత పొందారు. రివర్స్ బిడ్డింగ్‌లో చివరకు మెగావాట్ రూ. 4.91 కోట్లుగా నిర్థారించారు. ఇందులో ఆరు కంపెనీలకు టెండర్లను ఖరారు చేయాల్సి ఉంది.

► ఏపీ జెన్‌కో మాత్రం రివర్స్ బిడ్డింగ్ వ్యవహారంలో భేతాళ కథను తలపించేలా హైడ్రామా ఆడింది. బీహెచ్‌ఈఎల్‌ను ముందు పెట్టి కథ నడిపించారు. ఈ సంస్థ మెగావాట్‌కు రూ. 6.33 కోట్లు కోట్ చేసింది. మిగతా నాలుగు కంపెనీలు  అంతకన్నా ఎక్కువ (సుమారు రూ. 7 కోట్ల వర కూ) కోట్ చేశాయి. రివర్స్ బిడ్డింగ్‌లో బీహెచ్‌ఇల్ మెగావాట్‌కు 6.25 కోట్లకు దిగిరావడంతో, అదే ధరకు మిగిలిన సంస్థలకూ కట్టబెట్టారు. ఈ కథ వెనుక బీహెచ్‌ఈఎల్ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయనే విమర్శ లూ ఉన్నాయని నిపుణులు కమిటీ తేల్చినట్టు తెలిసింది.

► నిజానికి ఎన్టీపీసీ ఈ ఏడాది ఫిబ్రవరి 24న రివర్స్ ఆక్షన్ చేసిన నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 శాతం క్షీణించింది. దీనివల్ల ఇక్కడ సోలార్ ప్యానల్స్ దిగుమతి ఖర్చు పెరిగే వీలుంది. అదీగాక ఎన్టీపీసీకి కేటాయించిన భూములను చదును చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఎక్కువ ఎక్కువ వ్యయం చేయాల్సి ఉంటుంది. ఏపీ జెన్‌కోకు కేటాయించిన భూముల్లో ఇలాంటి పనుల కోసం పెద్దగా వెచ్చించాల్సిన అవసరమే లేదు. అయినా ఎన్టీపీసీ కన్నా, ఏపీ జెన్‌కో ఈపీసీ కాంట్రాక్టులు ఏకం గా రూ. 755 కోట్లు ఎక్కువగా ఉండే వీలుందని సాక్షి కథనాన్నే సమర్థించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా టెండర్లును రద్దుచేశారు. అయితే పరువుపోవడంతో ఈ విషయాన్ని ఏపీ జెన్‌కో తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొనకపోవడం గమనార్హం.

 

 టెండర్లను రద్దు చేశాం

 ఏపీ జెన్‌కో 500 మెగావాట్లకు పిలిచిన సోలార్ టెండర్లను రద్దు చేశాం. తిరిగి మళ్ళీ టెండర్లు పిలవమని జెన్‌కోకు చెప్పాం. టెండర్‌లో పాల్గొన్న సంస్థలు మార్కెట్ రేట్ల కన్నా ఎక్కువగా కోట్ చేశారు. ఎన్టీపీసీ కూడా 750 మెగావాట్ల టెండర్లను రద్దు చేసింది. ఈసారి నిబంధనలన్నీ ఎన్టీపీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూస్తున్నాం.

     - అజయ్ జైన్, ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

 

 ఆ సంస్థలకు లేఖలు పంపించాం

 సోలార్ టెండర్ల రద్దు విషయాన్ని టెండర్‌లో పాల్గొన్న ఐదు సంస్థలకు లేఖల ద్వారా తెలిపాం. అయితే ఈ విషయాన్ని ఏపీ జెన్‌కో వెబ్‌సైట్‌లో పొందుపర్చాల్సి ఉంది. కానీ ఎందుకు పెట్టలేదనే విషయాన్ని పరిశీలిస్తాను. మార్కెట్ రేట్లతో పోలిస్తే సోలార్ ఈపీసీ కాంట్రాక్టులు ఎక్కువగా ఉన్నాయని గుర్తించాం. అందుకే రద్దు చేయాల్సి వచ్చింది.  

 -  సీహెచ్ నాగేశ్వరరావు, డెరైక్టర్, హైడల్, ఏపీ జెన్‌కో

 

 ‘‘సోలార్ ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టులకు ఏపీ జెన్‌కో టెండర్లు పిలిచింది. మెగావాట్ రూ. 6.25 కోట్లు టెండర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. పక్కనే ఉన్న ఎన్టీపీసీ మాత్రం ఇదే తరహా కాంట్రాక్టును మెగావాట్ రూ. 4.91 కోట్లకే ఇస్తుంది. ఇది మామూలు స్కాం కాదు. రూ. 755 కోట్ల కుంభకోణం.’’

 - ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో   ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 

 ‘‘సోలార్ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తారా? మీరు మీ నాయకుడు

 (వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి) నిరూపించకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ముందు ఇది తేల్చండి. అప్పుడే అసెంబ్లీలో వేరే అంశం చేపడతాం. నేను సవాల్ విసురుతున్నాను. అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. లేకపోతే మీరు ఈ హౌస్‌లోకి వచ్చే అర్హత లేదు. నీతి నిజాయితీతో ఉన్నాను కాబట్టే నన్ను ఏమీ చేయలేకపోతున్నారు. ఎప్పుడూ తప్పు చేయను. నీతివంతమైన పాలన అందిస్తున్నాను.’’    

-సీఎం చంద్రబాబు

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top