‘కాగితం’తో భగ్నమైన కుట్ర!

‘కాగితం’తో భగ్నమైన కుట్ర! - Sakshi


2004లో గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర అమెరికా, ఇజ్రాయెలీల హత్యకూ పథకంవాహన దొంగను పట్టిన టాస్క్‌ఫోర్స్    అతడి వద్ద లభించిన ఫోన్ నెంబర్ల స్లిప్ కూపీతో భగ్నమైన లష్కరే తొయిబా పన్నాగం  అజీజ్‌ను సోమవారం అరెస్టు చేసిన సీఐడీ



సిటీబ్యూరో: సౌదీ నుంచి డిపోర్టేషన్‌పై తీసుకొచ్చిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్‌ను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు 2004 నాటి గణేష్ ఆలయం పేల్చివేత కుట్రలో సోమవారం సాంకేతికంగా అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అజీజ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కో రుతూ పిటిషన్ దాఖలు చేశారు. పన్నెండేళ్ల క్రితం నాటి ఈ భారీ కుట్ర వెలుగులోకి రావడంలోనూ ఆసక్తికర కో ణం ఉంది. ఓ వాహన దొంగ వద్ద లభించిన చిన్న కాగి తం ముక్క ఆధారంగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు చేపట్టి భారీ విధ్వంసానికి జరిగిన కుట్రను భగ్నం చేశారు.

 

సీజర్‌లో దొరికిన స్లిప్...

నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్ హఫీజ్‌బాబానగర్‌లో మెకానిక్‌గా స్థిరపడిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్‌కు పలు వాహనచోరీలతో ప్రమేయం ఉందని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఓ వేగు సమాచారం ఇచ్చాడు.  వెంటనే టాస్క్‌ఫోర్స్ అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వాహన చోరీలు చేస్తున్నట్టు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసే ముందు చోరీ వాహనాలను రికవరీ చేయడంతో పాటు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. వాటిలో ఉన్న ఓ చిన్న స్లిప్‌లోని వివరాలు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాయి.

 

లీడ్ ఇచ్చిన ఫోన్ నెంబర్లు...

ఆ స్లిప్‌లో కాశ్మీర్‌తో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన ఫోన్ నెంబర్లు ఉండటంతో ఖదీర్‌ను లోతుగా విచారించగా... ఇతని స్నేహితుడైన ఒమర్ ఫారూఖ్ షరీఫ్ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్‌హౌస్‌లో నివసిస్తున్న గిడ్డా అజీజ్‌ల పేర్లు చెప్పడంతో పాటు వారిద్దరూ బండ్లగూడ గౌస్‌నగర్‌లోని ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందాలు గౌస్‌నగర్‌లోని డెన్‌పై దాడి చేయగా... అక్కడ ఫారూఖ్ చిక్కగా... అజీజ్ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్ 2001లో కుట్ర, ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్థారించుకున్నారు. దీంతో ఖదీర్, ఫారూఖ్‌లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.

 

లష్కరేతొయిబా ప్రేరణతో
...

సిటీలో తమ ఘర్షణలు సృష్టించాలని పథకం వేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా..   గణేష్  నిమజ్జనం రోజు సికింద్రాబాద్‌లోని గణేష్ ఆలయం పేల్చివేతకు కుట్ర పన్నిందని బటయపడింది. దీని కోసం నగరానికి చెందిన సానుభూతిపరులతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల్లో శిక్షణ పొంది వచ్చిన వారినీ ప్రేరేపించింది. ఇందులో భాగంగా నగరానికి చెందిన కొందరితో పాటు గులాం యజ్దానీ(ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు) సహా 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్‌కు చెందిన కొందరు ఇతర మతస్తులుగా వేషం వేసుకుని గణేష్ ఆలయంలోకిప్రవేశించి బాంబు పెట్టాలని పథకం వేశారు.  గులాం యజ్దానీ ఆ దేశాల మేరకు ఈ పనితో పాటు సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టుల్నీ చంపాలని భావించారు. అం దుకు అవసరమైన పేలుడు పదార్థాలు, వాహనాలనూ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుసదాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి ఆయుధాలు, పేలు డు పదార్థాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

 

అప్పట్లో అత్యంత వివాదాస్పదం...

ఈ అరెస్టుల సమయంలో టాస్క్‌ఫోర్స్ అత్యంత వివాదాస్పదమైంది. అమాయకుల్ని కేసుల్లో ఇరికించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఐడీ అధికారులు విచారణ జరిపి ఆ ఆరోపణలు నిరాధారమైనవని తేల్చారు. ఆపై కేసు కూడా దర్యాప్తు నిమిత్తం వారికే బదిలీ అయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టోలిచౌకి వాసి మహ్మద్ జావేద్ 2008 ఆగస్టులోనూ హల్‌చల్ చేశాడు. కండిషనల్ బెయిల్‌పై ఉన్న జావేద్ అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లడానికి వీలు లేదు. అయినా దుబాయ్ సందర్శించడానికి వీసా పొందిన ఇతగాడు 2008 ఆగస్టు 16 శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కాలని ప్రయత్నించాడు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో చిక్కడంతో వారు సీఐడీకి అప్పగించారు. అలా వెళ్లడానికి కారణాలను విచారించిన అధికారులు జావేద్‌ను విడిచిపెట్టారు. నాటి నుంచి పరారీలో ఉన్న గిడ్డా అజీజ్‌ను సీఐడీ సోమవారం అధికారికంగా అరెస్టు చేసింది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top