స్పృహలో ఉండగానే ‘బ్రెయిన్‌డెడ్’!

స్పృహలో ఉండగానే ‘బ్రెయిన్‌డెడ్’!


మన్సూరాబాద్: ప్రాణాలతో స్పృహలో ఉన్న ఓ మహిళకు బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు చెప్పడంపై రోగి తరపు బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది. బాధితుల కథనంప్రకారం...  హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి భార్య అమృతారెడ్డి(22)ని ప్రసవం కోసం గత నెల 23న కమ్మగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.



ప్రసవం సమయంలో గర్భ సంచి చీలిపోవడంతో అధిక రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల చికిత్స తర్వాత కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత మరోసారి  అధిక రక్తస్రావం అవడంతో ఈనెల 19న మళ్లీ ఆమెను ఇదే ఆస్పత్రిలో చేర్పించారు.



20న వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఈ సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. శ్వాస కూడా తీసుకోలేక పోతుండటంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. కిడ్నీ ఫెయిల్ కావడంతో పాటు బ్రెయిన్‌డెడ్ అయిందని ఆదివారం ఉదయం చికిత్స అందిస్తున్న వైద్యులు ఆమె బంధువులకు తెలిపారు. డిశ్చార్జ్ చేస్తామని అంబులెన్స్ తెచ్చుకోండి అని చెప్పారు.  ఇదే సమయంలో కొంత మంది బంధువుల ఐసీయూలోకి వెళ్లి అమృతారెడ్డిని పలకరించగా కాళ్లు, చేతులు కదిపింది.



దీంతో ఆశ్చర్యపోయిన వారు ప్రాణాలతో స్పృహలో ఉన్న మనిషిని బ్రెయిన్‌డెడ్ అయిందని చెప్పడం ఏమిటని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస ్పత్రి ముందు బైఠాయించారు. ఇదిలా ఉండగా... రోగిని బతికించేందుకు  వైద్యులు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రోగి బంధువులు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆస్పత్రి ఎండీ డాక్టర్ శశిధర్‌రెడ్డి‘సాక్షి’కి తెలిపారు.  ప్రస్తుతం అమృతారెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యానికి ఆమె శరీరం కూడా సహకరించడం లేదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top