నడిపించే నాయకుడేడీ...!!

నడిపించే నాయకుడేడీ...!! - Sakshi


వరంగల్ ఉపఎన్నికల ఫలితాలతో తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి కుదేలైంది. ఈ ఫలితం కాంగ్రెస్‌లో తీవ్ర నిరాశా నిస్పృహలను నింపింది. పార్టీని నడిపించడానికి సరైన నాయకుడు లేనందువల్లే ఉపఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉపఎన్నిక విషయంలో అంతా ఒక్కటై పని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా టీ-పీసీసీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం, టికెట్ ఖరారు చేసే విషయంలో కూడా సమన్వయం లేకపోవడం వంటి అనేక అంతర్గత సమస్యలు ఈ పరిస్థితిని తెచ్చాయని చెబుతున్నారు. వీటికి తోడు టీఆర్‌ఎస్ విషయంలో తమ అంచనాలు కూడా తారుమారయ్యాయని అంటున్నారు. అధికారం చేపట్టిన 17 నెలల తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన కాంగ్రెస్ నేతలకు.. ఓరుగల్లు ప్రజల తీర్పు పెద్ద షాకిచ్చింది. గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా సాధించుకోలేక చతికిలపడింది.



కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్ వంటి జాతీయ నేతలను రప్పించి ప్రచారం చేయించినా డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి రావడం ఆ పార్టీ నేతలను అంతర్మథనంలో పడేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అంటూ సవాలు చేశారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు, చిట్టచివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం లాంటి అనేక కారణాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయని నేతలు తాజాగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న తమ అంచనా తప్పిందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి స్వల్పకాలమే అయినందున ఆ ప్రభుత్వం పట్ల ప్రజలింకా నమ్మకంతో ఉన్నారని ఈ ఫలితాలతో తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. మొదట్లో స్థానిక కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల వానీగా సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో కొంత కదలిక తెచ్చారు.



రాజయ్య ఎఫెక్ట్

ఉప ఎన్నిక నామినేషన్ దాఖలుకు చిట్టచివరి రోజున కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ విషయంలో రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. సర్వే సత్యనారాయణతో అప్పటికప్పుడు నామినేషన్ వేయించారు. సరైన సమన్వయం చేసేవారు లేకపోవడంతో సర్వేకు ఘోర పరాజయం తప్పలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2,69,065 ఓట్లు రాగా ఈసారి 1,55,957 ఓట్లు మాత్రమే రావడం, గతంతో పోల్చితే లక్షకు పైగా ఓట్లు తగ్గడం కాంగ్రెస్ నేతలను నివ్వెరపరిచింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top