'మా గతే టీఆర్ఎస్‌కూ పడుతుంది'


సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీని నెత్తికెక్కించుకుంటే ఇప్పుడు మాకు (కాంగ్రెస్‌ నేతలకు) పట్టినగతే టీఆర్‌ఎస్‌కు కూడా పట్టక తప్పదని రాజ్యసభసభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వీ హనుమంతరావు హెచ్చరించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరో బిన్‌లాడెన్ లాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎంఐఎంను నెత్తిన పెట్టుకుని తమ పార్టీ నాయకులు కొందరు తప్పు చేశారని వ్యాఖ్యానించారు. మజ్లిస్‌కు ఆనాడు మద్ధతు చేసిన నాయకులే ఇప్పుడు తన్నులు తినాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.



ఒవైసీకి మద్దతు పలకడాన్ని సీఎం కేసీఆర్ మానుకోవాలని వీహెచ్ సూచించారు. మజ్లిస్ విషయంలో కేసీఆర్ తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో తమ పార్టీ నాయకులకు పట్టినగతి ఆయనకు తప్పదని హెచ్చరించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలను తీసుకున్న తర్వాత ఎంఐఎం సంగతి ఏమిటో అర్థమవుతోందన్నారు. ఒవైసీ సోదరులకు మద్దతును ఇవ్వడమంటే పాముకు పాలు పోసి పెంచినట్టేనని పేర్కొన్నారు. అసదుద్దీన్‌పై కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఆగడాలపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. కాంగ్రెస్‌ను ఖతం చేయడానికి మోదీతో జతకడ్తామని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అవకాశవాదానికి పరాకాష్ట అని వీహెచ్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షునిపైనే దాడి జరిగితే తమ పార్టీ ఏమీ చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ నాయకత్వమే కారణమన్నారు. ఇకనుంచి హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని తామే నడుపుకుంటామని వీహెచ్ చెప్పారు.

Election 2024

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top