మా ఉసురే తగిలింది

మా ఉసురే తగిలింది - Sakshi


* కాంగ్రెస్ మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, సీనియర్లపై కార్యకర్తల ఫైర్

* తిట్లు, శాపనార్థాలు, తోపులాటలతో పీసీసీ సమావేశం రసాభాస


 

సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో దారుణ ఓటమితో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల కడుపు మండింది. గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులపై వారంతా దుమ్మెత్తి పోశారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ కార్యకర్తలను పట్టించుకోకపోవడంవల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి దాపురించిందని ఆక్రోశించారు.



కార్యకర్తల ఉసురు తగిలి ఆ నాయకులంతా సర్వనాశనమైపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా పార్టీని గెలిపించుకోలేకపోయిన ఆ మాజీలంతా చీము, నెత్తురు లేని చవటలు, దద్దమ్మలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పార్టీని ప్రక్షాళన చేసి, కష్టపడే కార్యకర్తలకు చోటివ్వకపోతే కాంగ్రెస్  పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరించారు.



గత ప్రభుత్వంలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అనుభవించిన వారికి పీసీసీ, డీసీసీ జాబితాల్లో చోటిస్తే సహించేది లేదని  హెచ్చ రించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో గురువారం జరిగిన తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చోటు చేసుకున్న దృశ్యాలివి...

 

 ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ హెచ్.వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు జి.నాగయ్య, ప్రధానకార్యదర్శులు కుమార్‌రావు, నరసింహా రెడ్డి, మాజీమంత్రి ఫరీదుద్దీన్‌లతోపాటు పీసీసీ అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు సహా దాదాపు 200 మంది హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఆరంభం నుంచే నిరసనల సెగలు మొదలయ్యాయి.

 

పొన్నాల లక్ష్మయ్య సమావేశాన్ని ప్రారంభిస్తుండగానే హైదరాబాద్ నగర నాయకుడు బాలపోచయ్య లేచి 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తన పేరును కుట్రపూరితంగా కార్యదర్శుల జాబితా నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగా రు. ఆయనకు సహ కార్యదర్శులు బొల్లు కిషన్, గౌరీశంకర్, టి.నిరంజన్ మద్దతుగా నిలిచారు.



మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పెద్దల పేర్లను ప్రస్తావిస్తూ తిట్ల దండకం అందుకున్నారు.దీనిని కొందరు నేతలు అడ్డుకోబోవడంతో గొడవ మొదలై తోపులాట జరిగింది. గాంధీభవన్ ఇన్‌చార్జి కుమార్‌రావుపై గౌరీ శంకర్ చేయి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  మీడియాను బయటకు పంపించి వేశారు.

 

సీనియర్లే లక్ష్యంగా విమర్శలు


కొద్దిసేపటి తరువాత సమావేశం మళ్లీ ప్రారంభమయ్యాక ఒక్కో నాయకుడు లేచి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. దాదాపు 45 మంది కార్యదర్శులు, సహాయ కార్యదర్శులకు మాట్లాడే అవకాశం వచ్చింది. వారంతా దాదాపుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలే లక్ష్యంగా విమర్శలు సంధించారు. దాదాపు అందరూ పార్టీని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్వనాశనం చేశారంటూ అసభ్య పదజాలంతో శాపనార్థాలు పెట్టారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top