అవాకులు ఆపండి

అవాకులు ఆపండి - Sakshi


* పులిచింతల నిర్వాసితులతో మాట్లాడండి: ఉత్తమ్

* సీఎం, హరీశ్‌వి దిగజారుడు రాజకీయాలు


సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయే నిర్వాసితులతో సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించా రు. పులిచింతల ప్రాజెక్టుపై మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం, మంత్రి హరీశ్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తమకు అన్యాయం జరిగిందని పులిచింతల నిర్వాసితులు అంటే అన్ని పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించారు.



ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్వాసితుల పక్షాన తాము పోరాటాలు చేసి అరెస్టయిన సంగతిని టీఆర్‌ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ, మండలిలో ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కతో కలసి సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.



‘‘నాడు పులిచింతల నిర్వాసితులతో మాట్లాడి, వారికి ఏయే వసతులు కావాలో అడిగి, అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కాంగ్రెస్ కృషి వల్లే పులిచింతల నుంచి 130 మెగావాట్ల జల విద్యుత్ తెలంగాణకు వచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ ఈ విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. అప్పుడు 2013 భూసేకరణ చట్టం లేకున్నా నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మంచి పరిహారం అందించాం. దాంతో రైతులు ఇప్పటికీ ఆ భూములను సాగు చేసుకుంటున్నారు.



పులిచింతల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి పరిసర గ్రామాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించాం. అప్పడు సీఎంలుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలతో భూనిర్వాసితులను సమావేశపరిచాం. పులిచింతల ఆదర్శ గ్రామాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడితే వాస్తవాలేమిటో తేలుతాయి. సీఎం, హరీశ్‌కు దమ్ముంటే ఆదర్శ గ్రామాలకు రావాలి. తమకు అన్యాయం జరిగిందని పులిచింతల నిర్వాసితులు అంటే అన్ని పదవులకు రాజీనామా చేస్తా’’ అని ఉత్తమ్ అన్నారు. తమ ప్రభుత్వాలు పులిచింతల విషయంలో పరిహారం ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదని, అయితే టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

 

ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తోంది

మల్లన్నసాగర్ విషయంలో ప్రభుత్వం బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చర్యలకు దిగుతోందని ఉత్తమ్ ఆరోపించారు. భూములు కోల్పోయే రైతులతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎందుకు సమావేశం కాలేదని ప్రశ్నించారు. బెదిరించి భూములను గుంజుకోవడానికి ఆర్డీవో, ఎమ్మార్వోను వాడుకుంటూ రెవెన్యూ అధికారులను బ్రోకర్లుగా మార్చేశారని వ్యాఖ్యానించారు. రైతులను బెదిరించి సంతకాలు చేసుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతులకు పరిహారం అందించాలని, ప్రజలు కోరుకున్న వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. భూముల మార్కెట్ విలువలను తాజాగా అంచనా వేయాలన్నారు.  ప్రాజెక్టులు నిర్మించే ముందు తప్పకుండా విలువలు మారుతాయని పేర్కొన్నారు. మారిన విలువలను అంచనా వేసిన తర్వాత, రైతు ఏది కోరితే దాని ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన నిలిచి పోరాడతామన్నారు.

 

ప్రభుత్వం ఆడమన్నట్టు ఆడలేం: జానారెడ్డి

ప్రభుత్వంలో ఉన్నవారు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేసుకుంటూపోతే వారు ఆడమన్నట్టు ఆడలేమని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. ‘‘మల్లన్నసాగర్ విషయంలో కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం సరికాదు. ప్రాజెక్టులను అడ్డుకుంటోందని అంటున్నారు. మేం అభివృద్ధికి సహకరిస్తాం. కానీ ఆ పేరుతో ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం’’ అని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ విషయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలన్నారు.



రైతులకు ప్రాజెక్టు కింద ఒకట్రెండెకరాల భూమిని ప్రభుత్వమే కొనివ్వాల్సి ఉంటుందన్నారు. గతంలో ప్రాజెక్టులను నిర్మించినప్పుడు సీఎం వద్ద నిర్వాసితులను కూర్చోబెట్టి, పరిహారం ఇప్పించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వం అలాంటి సంప్రదాయాలను పక్కనబెట్టి, రైతుల నుంచి దౌర్జన్యంగా భూములను గుంజుకోవాలని చూస్తోందని విమర్శించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top