సింగరేణి కార్మికులకు పరిహారం పెంపు


సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్నిరూ.12.50 లక్షలకు  పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. ఆదివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సుతీర్థ భట్టాచార్య సమక్షంలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల నాయకులతో ఈ సమావేశం జరిగింది.



పలు అంశాలపై ఒప్పందాలు కుదిరినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి వెల్లడించారు. చనిపోయిన లేదా అన్‌ఫిట్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులు డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుంటే.. రూ.12.50 లక్షల పరిహారం చెల్లించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టెనో, పీఏ, పీఎస్ కేడర్‌ను మార్చేందుకు అంగీకారం కుదిరింది. మిగతా కేడర్ స్కీములపై యూనియన్లు, యాజమాన్యం అంతర్గత కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నారు. డిస్మిస్ అయిన కార్మికులకు వయసు, మస్టర్ల నిబంధనలు లేకుండా ఉద్యోగ అవకాశం కల్పించాలని కార్మిక సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు.



మహిళా ఉద్యోగులకు కోల్ ఇండియా తరహాలో వీఆర్‌ఎస్ స్కీం అమలు చేయాలని, ప్రసూతి, శిశు సంరక్షణ సెలవులు అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. భూగర్భగనుల్లో పని చేసే మైనింగ్ టెక్నీషియన్లు అన్‌ఫిట్ అయితే.. వారికి సరిపడే ఉద్యోగం కల్పించాలని కోరగా, దీనిపై కమిటీని వేసి నిర్ణయం తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది. గని ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని, యాక్సిడెంట్లకు ఈపీ ఆపరేటర్లను బాధ్యులను చేసి డిమోషన్ చేయడం, ఇంక్రిమెంట్లలో కోత వేయటాన్ని కార్మిక సంఘాలు  వ్యతిరేకించాయి.



కాగా, టీఎస్‌పీఎస్సీ ద్వారా కొత్త నియామకాలు చేపడతామని యాజమాన్యం తెలిపింది. కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రిలో కిడ్నీలకు సంబంధించిన డయాలిసిస్ సదుపాయాన్ని ప్రారంభించేందుకు  అంగీకరించింది.  అనంతరం కోల్ ఇండియా సీఎండీ పదవికి ఎంపికైన సీఎండీ భట్టాచార్యను టీజీబీకేఎస్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో సీఎండీతో పాటు డెరైక్టర్లు వివేకానందా, రమేశ్‌కుమార్, మనోహర్‌రావు, రమేశ్‌బాబు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top