ఆత్మహత్య చేసుకుంటా...

ఆత్మహత్య చేసుకుంటా... - Sakshi


విద్యుత్ స్తంభం ఎక్కి

వికలాంగుడి హల్‌చల్

స్తంభించిన ట్రాఫిక్


 

 కాటేదాన్: అప్పుల బాధకు తోడు... చోరీ నింద మోపండంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ శారీరక వికలాంగుడు బుధవారం ఆరాంఘర్ చౌరస్తాలోని 33 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్రసంచలనం సృష్టించింది.  మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, బాధితుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం....మైలార్‌దేవ్‌పల్లి ఉడెంగడ్డకి చెందిన నిజాముద్దీన్(35), సల్మా దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. నిజాముద్దీన్ గతంలో ఓ కంపెనీలో పనిచేస్తుండగా అతని ఎడమ చేయి మిషన్‌లో పడి వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. ప్రస్తుతం ఇతను ఆరాంఘర్ చౌరస్తాలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఇతను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా...  నిజాముద్దీన్ పనిచేసే కంపెనీ పక్కనే స్క్రాప్ గోదాం ఉంది. గత మంగళవారం ఆ గోదాంలో రూ.20 వేలు చోరీ అయ్యాయని,  ఆ డబ్బు నిజాముద్దీన్ అపహరించాడని గోదాం యజమాని ఆరోపించాడు. దీంతో తీవ్రమనోవేదనకు గురైన నిజాముద్దీన్ బుధవారం 5 గంటలకు ఆరాంఘర్ వైష్ణవి హోటల్ పక్కనేగల 33 కేవీ విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. విషయం తెలుసుకున్న ఏఈ కిషోర్ వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.



విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో సుమారు 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్‌దేవ్‌పల్లి సీఐ జావీద్.... స్తంభం దిగి కిందకు రావాలని నిజాముద్దీన్‌ను ఎంతగా కోరినా వినిపించుకోలేదు. దీంతో అతడిని కిందకు దించేందుకు ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ రిజ్వాన్ స్తంభంపైకి ఎక్కాడు. అయితే, ఎమ్మెల్యే వచ్చి తన సమస్యలు పరిష్కరిస్తానని, ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానని హామీ ఇస్తేగాని స్తంభంపై నుంచి కిందకు దిగే ప్రసక్తేలేదన్నాడు. చివరకు పోలీసు అతడిని బుజ్జగించి రాత్రి 7 గంటలకు కిందకు దించి, స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనతో కాటేదాన్, ఎన్‌డీఏ సబ్‌స్టేషన్లకు సుమారు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top