పన్ను చెల్లించని హోం డెలివరీ హోటళ్లకు కళ్లెం!


- 55 హోటళ్లపై వాణిజ్య పన్నుల శాఖ దాడులు  

- రూ.30 కోట్ల టర్నోవర్ జరిగినట్లు నిర్ధారణ  

 

 సాక్షి, హైదరాబాద్: నగరంలో పన్ను చెల్లించకుండా హోం డెలివరీ వ్యాపారం చేస్తున్న హోటళ్లపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 55 హోటళ్లపై దాడులు చేసింది. ఇవి పన్ను చెల్లించకుండా హోం డెలివరీ ద్వారా ఏడాది కాలంలో రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఆర్జించినట్టు గుర్తించింది. వీటికి నోటీసులు పంపించింది. రాజధానిలో ఇటీవల హోండెలివరీ ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేసే హోటళ్లకు బాగా ఆదరణ పెరిగింది. ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లకు పైగా ఈ తరహా వ్యాపారం జరిగి నట్టు అంచనా. దీనిపై 14.5 శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లించాల్సి ఉంది.



అయితే స్టార్ హోటళ్లు, పేరున్న రెస్టారెంట్లు మినహా మరే హోటల్ యజమానులూ పన్ను చెల్లించకుండా జీరో దందా చేస్తున్నట్లు తేలింది. 2015-16లో స్విగ్గీ, ఫుడ్ పాం డా, ఫుడ్ మానియా, జొమాటో, బిహంగ్రీ, గెట్ మై ఫుడ్ వంటి  హోండెలివరీ సర్వీస్ ప్రొవైడర్ల రికార్డులను అధికారులు పరిశీలించగా... రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు గుర్తించారు. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కొండాపూర్, మణికొండ, కూకట్‌పల్లి, ఈసీఐఎల్, ఉప్పల్ వంటి ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు ఉన్న ప్రాంతాలతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌ల్లోని హోటళ్ల నుంచి ఎక్కువ వ్యాపారం జరిగినట్లు తేల్చారు. పన్ను చెల్లించని 55 హోటళ్లపైన దాడులు చేశారు. వీటిలో 15 హోటళ్లకు ఇప్పటి వరకు టిన్, వ్యాట్ రిజిస్ట్రేషన్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ 55 హోటళ్ల నుంచే ఏడాది కాలంలో రూ.30 కోట్లకు పైగా విలువైన వ్యాపారం జరిగినట్లు లెక్కగట్టారు. జరిగిన వ్యాపారానికి 14.5 శాతం పన్ను, అపరాధ రుసుము విధించారు. ఇప్పటి వరకు కోటి రూపాయల వరకు వసూలు చేశారు.



 వెబ్ డేటా షేరింగ్: హోటళ్ల జీరో దందాను అరికట్టేందుకు ఆన్‌లైన్ సర్వీస్ ప్రొవైడర్లతో వాణిజ్య పన్నుల శాఖ అనుసంధానం కావాలని నిర్ణయించింది. ఆయా వెబ్‌సైట ్లకు వచ్చిన ఫుడ్ ఆర్డర్, ఏ హోట ల్ నుంచి సరఫరా జరుగుతుందనే డేటా ఎప్పటికప్పుడు శాఖకు చేరేలా ‘వెబ్ డేటా షేరింగ్’ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. వ్యాట్ చెల్లించని, టిన్ నంబర్ లేని హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ తీసుకోవద్దని కమిషనర్ అనిల్‌కుమార్ ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను త్వరలోనే అమలు చేయనున్నట్లు అదనపు కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రేవతి రోహిణి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top