ఏకగ్రీవం...

ఏకగ్రీవం...


’ జీహెచ్‌ఎంసీలో ఐదుగురు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి

’ మైనార్టీల నుంచి ఇద్దరు...

’ మున్సిపల్ నిపుణులు..మేధావుల నుంచి ముగ్గురు


 


సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మంగళవారం పూర్తయింది. ఏకగ్రీవంగా ఐదుగురు సభ్యులను ఎన్నుకున్నారు. మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరు, మునిసిపల్ వ్యవహారాల్లో నిపుణులు.. మేధావి వర్గంనుంచి ముగ్గుర్ని కో ఆప్షన్ సభ్యులుగా సభ్యుల ఆమోదం మధ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికకు సంబంధించి మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో తొలుత మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరిని ఎన్నుకున్నారు. అనంతరం కొంత సేపు విరామంతో మునిసిపల్ వ్యవహారాల్లో నిపుణులు.. మేధావి వర్గంనుంచి ముగ్గురిని ఎన్నుకున్నారు. మైనార్టీ వర్గాల నుంచి రోడా  విద్యా స్రవంతి, మహ్మద్ హుస్సేన్, మునిసిపల్ వ్యవహారాల్లో నిపుణులు.. మేధావుల నుంచి గొట్టిముక్కల జ్యోతి, ఎం.రాజీవ్‌గుప్తా, సి.నర్సింహారావులు ఎన్నికయ్యారు. వీరిలో తొలుత  విద్యాస్రవంతి పేరును వెంకటేశ్వరనగర్ కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించగా, అంబర్‌పేట కార్పొరేటర్ పులి జగన్ సమర్ధించారు. మహ్మద్ హుస్సేన్ పేరును దూద్‌బౌలి కార్పొరేటర్ గఫార్ ప్రతిపాదించగా, అహ్మద్‌నగర్ కార్పొరేటర్ అయేషా రూబినా సమర్ధించారు. గొట్టిముక్కల జ్యోతి పేరును పద్మావతి ప్రతిపాదించగా, గోపు సరస్వతి సమర్థించారు. రాజీవ్‌గుప్తా పేరును మేక రమేశ్ ప్రతిపాదించగా, రావుల విజయ సమర్ధించారు.





నర్సింహారావు పేరును సంజయ్‌గౌడ్ ప్రతిపాదించగా, సామల హేమ సమర్థించారు. ఉన్న స్థానాలకు మించి వేరెవరూ పోటీలో లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. వెంటనే వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్ రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వారికి నియామకపత్రాలు అందజేశారు. ప్రత్యేక సమావేశానికి నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.


 

కుదిరిన సయోధ్య..


అధికార టీఆర్‌ఎస్, ఎంఐఎంల మధ్య కుదిరిన సయోధ్యతో ఈ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గతంలో మైనార్టీల నుంచి జరగాల్సిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వాయిదా పడేందుకు తగినంతమంది సభ్యులు హాజరుకాక, కోరం లేదనే కారణం చూపుతూ అప్పట్లో వాయిదా వేశారు. ప్రస్తుతం ఉభయపార్టీల మధ్య తగిన ఒప్పందంతోనే ఇవి ఏకగ్రీవమైనట్లు తెలిసింది.


 

మాక్ సమావేశాలు..సెల్ఫీలు..


ఒక ఎన్నిక.. మరొక ఎన్నికకు మధ్య విరామ సమయంలో కొత్తగా ఎన్నికైన మహిళా కార్పొరేటర్లు వారిలో వారే మాక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం కనిపించింది. మైకు ముందు నుంచొని ఒకరు మాట్లాతుండగా, మరొకరు ఫోటోలు తీయడం, సెల్ఫీలు తీసుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి.


 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top