కడియంకు కేసీఆర్ ఝలక్

కడియంకు కేసీఆర్ ఝలక్ - Sakshi


హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఝలక్ ఇచ్చారా. కడియం శ్రీహరితో తీవ్ర విబేధాలున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావును పార్టీలో చేర్చుకోవడం వెనుక ఏం జరిగిందన్న అంశం ఇప్పుడు టీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారింది. ఎర్రబెల్లిని టీఆర్ఎస్లో చేర్చుకోవడం వెనుక కేసీఆర్కు పెద్ద వ్యూహమే ఉన్నట్టు పార్టీలో బలంగా వినిపిస్తోంది.



తెలంగాణలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులను చేర్చుకోవడం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని, ఆ కారణంగానే ఎర్రబెల్లితో పాటు ప్రకాష్ గౌడ్లను పార్టీలో చేర్చుకోవడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వాదన కేవలం తెరమీద కనిపించేది మాత్రమేనని, కొందరు నేతలను కట్టడి చేయడం కోసమే ఇలాంటి చేరికలను కేసీఆర్ ఆమోదించారని తెరవెనుక మరో అభిప్రాయం కూడా బలంగా ఉంది.



వరంగల్ జిల్లాలో రాజకీయ వైరుధ్యం ఉన్న కారణంగా ఇంతకాలం ఎర్రబెల్లి దయాకర్రావును టీఆర్ఎస్లోకి రాకుండా కడియం శ్రీహరి అడ్డుకుంటూ వచ్చారు. ఇంతకాలంగా అడ్డుకుంటున్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల విజయోత్సాహం నెలకొన్న తరుణంగా చడీచప్పుడు కాకుండా ఒక్కసారిగా ఎర్రబెల్లిని పార్టీలో చేర్పించుకోవడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే ఇందులో మతలబు వేరే ఉందని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.



డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం ప్రాధాన్యతను కొంత మేరకు తగ్గిస్తున్నామన్న పరోక్ష సంకేతాలు పంపించాలన్న ఉద్దేశంతోనే తాజా చేరికలకు కేసీఆర్ అంగీకరించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. విపక్షాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రేటర్ లో పట్టు సాధించడానికి దాని పరిధిలోని 150 డివిజన్లలో మెజారిటీ సాధించడంపైనే వ్యూహరచన చేశారు. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలోకి వచ్చే 23 అసెంబ్లీ సెగ్మెంట్లలో మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. కడియం శ్రీహరిని ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఇంచార్జీగా నియమించారు. అయితే కడియం మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియను వదిలేసి తన కుటుంబ సభ్యులను గడపడానికి విదేశీ పర్యటనకు వెళ్లారని తెలిసింది. ఆయన విదేశాలకు వెళ్లడం కేసీఆర్ ఆగ్రహం తెప్పించిదని అత్యంత విశ్వసనీయ సమాచారం.



ఈ పరిణామ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించారని చెబుతున్నారు. కీలకమైన ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు అప్పగించినప్పుడు వాటిని తేలికగా తీసుకున్న నేపథ్యంలోనే కడియంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఎర్రబెల్లిని చేర్చుకున్నారన్న అభిప్రాయం పార్టీలోని కొంతమంది నేతలు చెబుతున్నారు.



ఇదిలావుండగా, ప్రస్తుతం వరంగల్ జిల్లాలో  వేర్వేరు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులను టీఆర్ఎస్ లో చేర్పించుకున్న కేసీఆర్ వ్యూహం ముందుముందు ఎలా ఉండబోతోందన్న విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా జిల్లాలో వేర్వేరు ధ్రువాలుగా పనిచేస్తున్న కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కొండా మురళి... వీరు ఒకరి తర్వాత ఒరన్నట్టు టీఆర్ఎస్ లో చేరుతూ వచ్చారు. ఇప్పుడు ఆ ముగ్గురిని సమన్వయ పరుస్తారా... సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరుధ్యాలతో పనిచేస్తున్న ఈ నేతలు ఒక్కతాటిపై పనిచేయడం సాధ్యమవుతుందా... ఈ విషయంలో కేసీఆర్ వ్యూహమేంటి అన్న దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా చర్చలు మొదలయ్యాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top