అధ్యయనం తరువాతే నిర్ణయం

అధ్యయనం తరువాతే నిర్ణయం - Sakshi


నగరంలోని అక్రమ కట్టడాలు,

లే అవుట్‌లపై ప్రభుత్వ సమాలోచన

ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌పై తగు సిఫారసులు చేయండి

నగర పాలన సంస్థలపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు



హైదరాబాద్: ‘‘అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని కట్టడాల గురించి సమీక్షించాలి. వాటిని కూలగొట్టడం ఉపయోగమా? క్రమబద్ధీకరించడం ఉపయోగమా? వాటి పర్యవసానాలేమిటి? అనే విషయంపై అన్ని కోణాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకోవాలి. భూముల క్రమబద్ధీకరణలో సైతం ఇలాంటి ప్రయత్నం జరగాలి. భవిష్యత్తులో మళ్లీ అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు జరగకుండా పటిష్ట విధానం రూపొందించాలి.’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్), లే అవుట్‌ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)ను ప్రవేశపెట్టడంపై తగు సిఫారసులు చేయాలని కోరారు.



అస్తవ్యస్తంగా, అడ్డదిడ్డంగా తయారైన హైదరాబాద్‌ను చక్కదిద్దడంతో పాటు కొత్తగా విస్తరిస్తున్న నగరం క్రమపద్ధతిలో వుండే విధంగా చర్యలు ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో భూముల క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కొత్త నివాసాలకు అనుమతుల విధానంతో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి సంస్థల పనితీరుపై గురువారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా, జలమండలి ఎండీ జగదీశ్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, పురపాలక శాఖ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హౌసింగ్ కార్యదర్శి దానకిషోర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.



ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం ల్యాండ్ అండ్ బిల్డింగ్ పాలసీని తీసుకురావాలసిన అవసరం వుంది. నగరంలో గృహ నిర్మాణ రంగం వృద్ధి చెందుతోంది. బిల్డర్లను కూడా ప్రోత్సహించాల్సిన అవసరముంది. గృహ నిర్మాణ రంగంలో అవినీతిని నిరోధించాలి. నగర పాలన విషయంలో కీలకమైన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి లాంటి సంస్థల పనితీరుపై అధ్యయనం చేసి భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించాలి. వివాదాల పరిష్కారం కోసం న్యాయ సలహాదారులను, సీనియర్ న్యాయవాదులను నియమించుకోవాలి. అక్రమాల నిర్మూలన కోసం ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించాలి. ఎంత జాగాలో ఎన్ని అంతస్తుల భవనానికి అనుమతి ఇవ్వవచ్చు అన్న అంశంపై శాస్త్రీయంగా, వాస్తవికంగా ఓ నిర్ణయానికి రావాలి. నగరంలో నిరుపేదల కోసం ఇంటి నిర్మాణం విషయంలో సైతం నిర్ణయం తీసుకోవాలి. రాజీవ్ స్వగృహ లాంటి పథకాల ద్వారా కట్టిన ఇళ్లను అవసరమైన వారికి ఇచ్చి ఉపయోగంలోకి తేవాలి. మంత్రులు నగరంపై మరింత దృష్టి పెట్టాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయపరిచే బాధ్యతను స్వీకరించాలి’’ అని పేర్కొన్నారు.

 

గత పాలకుల పాపాలే..

‘‘హైదరాబాద్ లేని తెలంగాణ 12 ఏళ్ల కిందే వచ్చేది. ఆలస్యం జరిగినా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ సాధించినం. చావు మీదికి తెచ్చుకుని మరీ గుండెకాయలాంటి హైదరాబాద్‌ను దక్కించుకున్నం. హైదరాబాద్‌తో పాటు వారసత్వంగా గత పాలకులు అనుసరించిన విధానాల పాపాలు కూడా వచ్చాయి. హైదరాబాద్‌ను ఆంధ్ర పాలకులు మనది అనుకోలేదు. అందుకే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా ఉన్నాయి. నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం సమీక్షించుకుంటూ నగరాన్ని తీర్చిదిద్దాలి.’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

ఆటోట్రాలీ డిజైన్ల ఆమోదం

హైదరాబాద్ నరగంలో చెత్త సేకరణ ఆటో ట్రాలీ డిజైన్లను సీఎం కేసీఆర్ ఆమోదించారు. గతంలో ఆయన సూచించిన డిజైన్లలో రంగులు మార్చి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి చూపించారు. వాటిని సీఎం ఆమోదించారు. ఇళ్లకు సరఫరా చేసే బ్లూ, గ్రీన్ ప్లాస్టిక్ చెత్త బుట్టలను సైతం ఆమోదించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top