విధిలేక తింటున్నాం

విధిలేక తింటున్నాం - Sakshi


- ఆహార కల్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన

- కల్తీ నుంచి బయటపడేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం

- కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర కూడా దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు

- రాష్ట్రావసరాలకు తగ్గట్లు పూలు, పండ్లు, కూరగాయలు పండించాలి

- సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీ ఇవ్వాలి

- ఉద్యానశాఖలో మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాలు ఏర్పాటు చేయాలి

-  ప్రభుత్వపరంగానే ప్రజలకు పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి అందించాలి

- ఉద్యానశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష




సాక్షి, హైదరాబాద్: ‘‘పండ్లు, కూరగాయలు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి... ఇలా ప్రతిదీ కలుషితం అవుతోంది. కల్తీలేని వస్తువంటూ లేకుండా పోయింది. ఏది తినాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భయానక పరిస్థితి నుంచి బయటపడేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. కల్తీల బారినుంచి ప్రజలను కాపాడేందుకు ఉద్యానశాఖ క్రియాశీలం కావాలన్నారు.

 

శనివారం క్యాంపు కార్యాలయంలో ఉద్యానశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అవసరాలకు సరిపడా పూలు, పండ్లు, కూరగాయలు, మసాలాలు రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేందుకు, రైతులు లాభదాయక వ్యవసాయం చేసేందుకు, ప్రజలు రసాయనాలు ఎక్కువగాలేని కూరగాయలు, పండ్లను తినేందుకు, కల్తీలేని మసాలాలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని సూచించారు. ఉద్యానశాఖను కూడా విస్తరించి మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, యాంత్రీకరణ వంటి విభాగాలను ఏర్పాటు చేసి అదనపు సంచాలకులను నియమించాలని ఆదేశించారు.

 

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ఆదేశం...

ప్రజలు ప్రతీ రోజూ ఏది తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని... నాణ్యమైనవి కాకున్నా విధిలేకే అందుబాటులో ఉన్నవి తినాల్సి వస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ దుస్థితిని అధిగమించేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. హైదరాబాద్ శివార్లలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వపరంగానే పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి వంటి వస్తువులు ప్రజలకు అందించాలని చెప్పారు. దీనికోసం ఉద్యానశాఖలో అదనపు సంచాలకుడిని, కావాల్సినంత సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

 

కరివేపాకు కూడా దిగుమతా...?

కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాలకు నిత్యం లక్షల టన్నుల కూరగాయలు, పండ్లు, పూలు అవసరమవుతుంటే అందులో 90 శాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని సీఎం చెప్పారు. తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకొని ఓవైపు దుబాయ్ వలస వెళ్తుంటే మరోవైపు మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు మాత్రం బెంగుళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

 

చివరకు కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర కూడా దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కావాల్సినన్ని కూరగాయలు, పండ్లను ఇక్కడే పండించాలని... తద్వారా దిగుమతి చేసుకునే బాధ తప్పుతుందని... మన రైతులు బాగుపడతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాల పరిసరాల్లోని రైతులకు అవగాహన కల్పించి కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలన్నారు. సూక్ష్మ సేద్యం ద్వారా పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ ఇవ్వాలని... ఎస్సీ, ఎస్టీ రైతులకు మరింత ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు.

 

రైతులంతా ఒకే రకం కూరగాయలు పండించడం వల్ల కూడా గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉండవని... కాబట్టి ఉద్యానశాఖ అధికారులే వ్యవసాయ భూములను జోన్లుగా విభజించి ఎక్కడ ఏవి సాగు చేయాలో రైతులకు నిర్దేశించాలని సూచించారు. వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చి అమ్ముతూ లాభం పొందుతున్న నేపథ్యంలో మన రైతులు ఎందుకు లాభం పొందడంలేదని ప్రశ్నించారు.

 

ఉద్యానశాఖలో మార్కెటింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెట్ వచ్చేలా కృషిచేయాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించాలని సూచించారు. వేప, నిమ్మ, సీతాఫల, కానుగ ఆకులతో ఎరువులు తయారుచేసేలా బయో పెస్టిసైడ్స్ రూపొందించాలని చెప్పారు.

 

 పూల తోటలపై దృష్టిపెట్టండి...


హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం వేల టన్నుల పూలను ప్రతీ రోజూ వాడుతున్నారని... అవి కూడా పక్క రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో పూల తోటలు పెంచేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.


తెలంగాణలో ప్రస్తుతం పాలీహౌజ్‌లు ఎన్ని, ఇంకా ఎన్నింటికి అవసరం ఉంది, రాష్ట్రానికి ఎంత మొత్తంలో కూరగాయలు, పండ్లు, పూలు అవసరం, ప్రస్తుతం ఎంత ఉత్పత్తి ఉంది, ఎంత దిగుమతి చేసుకుంటున్నాం? తదితర విషయాలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే జూన్ నాటికి ఉద్యానశాఖ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top