ఆస్ట్రేలియాలో నగర యువతి మృతి

ఆస్ట్రేలియాలో నగర యువతి మృతి - Sakshi


అదనపు కట్నం వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు

విమానాశ్రయంలో భార్య  మృతదేహాన్ని వదిలి భర్త పరార్


హైదరాబాద్: ఆస్ట్రేలియాలో కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డుకు చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులే తమ కుమార్తె మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భార్య మృతదేహాన్ని శంషాబాద్ విమానాశ్రయంలోనే వదిలి భర్త పరారవ్వడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రమ్య కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి...


వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు చెందిన పెందుర్తి పూర్ణచంద్రరావు కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి వచ్చి స్థిరపడ్డారు. ఆయన కుమార్తె రమ్యకృష్ణ బీటెక్ పూర్తిచేసింది. వరంగల్‌కే చెందిన నార్ల సుబ్రహ్మణ్యే శ్వరరావు కుమారుడు మహంత్‌కు రమ్యనిచ్చి 2012 ఆగస్టు 12న వివాహం చేశారు. పెళ్లి సమయంలో కోటి రూపాయలు విలువ చేసే ప్లాటు, యాభై లక్షల రూపాయల నగదు, కిలో బంగారం ఇచ్చారు. మహంత్, రమ్యలిద్దరూ ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు.


మహంత్‌ది వ్యాపారం. రమ్యది సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం. ఇటీవల వ్యాపారం కోసం మరో రూ.25 లక్షలు మహంత్‌కు పూర్ణచంద్రరావు పంపించారు. కాగా, ఈ నెల 18 మధ్యాహ్నం రమ్య తల్లి ఉషకు ఫోన్ చేసి మాట్లాడింది. భర్త వ్యాపారానికి మరికొంత డబ్బు అవసరమని చెప్పింది. రెండు గంటలకే రమ్య చనిపోయినట్టు ఫోన్ వచ్చింది. తల్లితో ఫోన్‌లో మాట్లాడిన తరువాత రమ్య, మహంత్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన రమ్య గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


 మృతదేహాన్ని తెచ్చేందుకు కష్టాలు...

రమ్య మృతదేహాన్ని తెచ్చేందుకు ఆమె సోదరుడు కృష్ణచైతన్య, బాబాయి రవి ఆస్ట్రేలియాకు వెళ్లారు. తన భార్య మృతదేహాన్ని ఖననం చేసే హక్కు తనదేనంటూ వారితో మహంత్ గొడవకు దిగాడు. ప్రాథేయపడగా చివరకు అతడు మృతదేహాన్ని వారితో పంపేందుకు అంగీకరించాడు. మృతదేహాన్ని శుక్రవారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయం వరకు వచ్చిన మహంత్...


రమ్య పాస్‌పోర్టు ఇవ్వాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులను అడిగాడు. వారు ఇవ్వనన్నారు. బాడీ రిసీవర్‌గా తన సోదరుడు సుమంత్ పేరును పేర్కొన్న మహంత్... మృతదేహాన్ని అప్పగించేది లేదని రమ్య కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారు పాస్‌పోర్టు ఇవ్వగానే అక్కడి నుంచే తిరుగుప్రయాణమయ్యాడు. రమ్య పేరున ఉన్న రూ.కోటిన్నర  ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మహంత్ ఆమెను హత్య చేసి ఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


 మాపై అభాండాలు...

రమ్య చావుకు తామే కారణమంటూ తమ కుటుంబంపై అభాండాలు వేస్తున్నారంటూ మహంత్ తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆరోపించారు. హన్మకొండ ఎన్పీడీసీఎల్‌లో ఏడీఏగా చేస్తున్న ఆయన మాట్లాడుతూ... పెళ్లయినప్పటి నుంచి కుమారుడు, కోడలు అన్యోన్యంగా ఉంటున్నారన్నారు. ఆత్మహత్యా యత్నం చేసిన రమ్య ఈ నెల 18న చనిపోయినట్టు వైద్యులు తెలిపారన్నారు.  


కొంత కాలంగా వేధిస్తున్నాడు...

చనిపోయే రెండు గంటల ముందు రమ్య తనతో ఫోన్‌లో మాట్లాడిందని, మహంత్ వ్యాపారానికి డబ్బులు అవసరమవుతాయని చెప్పిందని రమ్య తల్లి ఉష తెలిపారు. ‘మా అమ్మాయి తనను వేధిస్తున్న విషయం మాకు చెప్పలేదు. ఈ వేధింపుల వల్లే అఘాయిత్యానికి పాల్పడి ఉంటుంది. ఇలాంటి కడుపు కోత ఏ తల్లికీ రాకూడదు’ అంటూ ఉష రోదించారు. ఆస్ట్రేలియా వెళ్లినా మహంత్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, రమ్య సంపాదన మీదే ఇన్నాళ్లూ బతికాడన్నారు. రమ్య తండ్రి పూర్ణచంద్రరావు దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డికి సన్నిహితుడు. ముప్ఫై ఏళ్ల కిందట నగరానికి వచ్చి స్థిరపడిన పూర్ణచంద్రరావు రమ్య పేరుపై హోటల్ ప్రారంభించారు. దానికి రమ్య సెంటర్‌గా గుర్తింపు వచ్చింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top