పల్లె ముచ్చట్లు

పల్లె ముచ్చట్లు


ఇంట్లో ముచ్చట్ల నుంచి రచ్చబండ వరకు... పల్లెటూరు సంస్కృతి, సంప్రదాయాలను కళ్లముందు ఆవిష్కరిస్తుంది కంది నర్సింహులు చిత్రం. మెదక్‌జిల్లా కస్లాబాద్‌కు చెందిన ఈ యువ ఆర్టిస్టు మాదాపూర్ అలంకృత ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ‘రూరల్ విస్పర్’లో ఇలాంటి చిత్రాలెన్నో! గ్రామీణాన్ని పట్నాలకు తెచ్చిన ఈ చిత్ర ప్రదర్శన ఆబాలగోపాలాన్నీ అలరిస్తోంది. ఈ సందర్భంగా నర్సింహులును ‘సిటీ ప్లస్’ పలుకరించింది....  

 

మాది రైతు కుటుంబం. ఆరేళ్ల వయసు నుంచే బొమ్మలు గీస్తున్నా. స్కూల్లో జరిగే ప్రతి చిత్రలేఖన పోటీల్లో పాల్గొనేవాడిని. గాంధీ, నెహ్రూ వంటి జాతీయ నాయకులతో పాటు పల్లెల్లో పెంచుకొనే కోళ్లు, ఆవులు, గేదెలు, నెమళ్లను గీసేవాడిని. ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా డ్రాయింగ్ టీచర్ రుస్తుమ్... నన్ను మరింత ప్రోత్సహించారు. తరువాత జేఎన్‌టీయూ నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ పూర్తి చేశా.



పూర్తిస్థాయి ప్రొఫెషనల్ ఆర్టిస్టుగా మారా. ‘నవీకరణ పేరుతో గ్రామంలోనూ సిటీ ట్రెండ్ వచ్చేస్తోంది. నాటి ఊళ్లలో ఉన్న సంస్కృతి భావితరాలకు తెలియాలి. అందుకు మా ఊరునే వేదిక చేసుకున్నా. మహిళల సంభాషణ, బాలికలు, మహిళలు ధరించే వస్త్రాలు, మగవారు కట్టుకునే పంచ, లాల్చీ, రోజువారీ పనులు... ఇలా అన్నీ గ్రామాల్లోని జీవన విధానాన్ని ప్రతిబింబించేవే కాన్వాస్‌పై ఆవిష్కరించా.



అంతేకాదు... జాతర్లు, తిరునాళ్లు, బోనాలు, దసరా వంటి పండగలూ గీతల్లో చూపించా. నాడు-నేడు పోల్చుకుంటే నా ఊరే ఎంతో మారిపోయింది. ఆ మార్పులనే నా బొమ్మల్లో చూపుతున్నా. అక్రలిక్ ఆన్ కాన్వాస్, ఫైబర్ గ్లాస్, మిక్స్‌డ్ మీడియా పెయింటింగ్ వేస్తున్నా. ఇప్పటివరకు బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో కలిపి నాలుగు ప్రదర్శనలిచ్చా. ఇప్పటి వరకు 20కి పైగా గ్రూప్ ఆర్ట్ షోల్లో పాల్గొన్నా. సిటీవాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. నా ఊరిపై గీసిన చిత్రాలే అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టాయి. భవిష్యత్‌లోనూ ఈ పంథా కొనసాగిస్తా.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top