‘కొత్త’ గుబులు

‘కొత్త’ గుబులు


మారనున్న డివిజన్ల ముఖచిత్రం

విభజన పై నేతల్లో ఆందోళన

భవిష్యత్తుపై దిగులు

పట్టుకోసం కొందరి యత్నం

అధికారుల తీరుపై అసంతృప్తి


 

సాక్షి నెట్‌వర్క్:  జీహెచ్‌ఎంసీ పునర్విభజన ప్రక్రియ కొందరు రాజకీయ నేతల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రస్తుతమున్న 150 డివిజన్ల సంఖ్యలో మార్పు ఉండదు. అయితే జనాభాకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తుండటంతో కొన్ని డివిజన్లు మాయం కానున్నాయి. హేతుబద్ధీకరణ కోసం 45 వేల జనాభాకు అటూ ఇటూగా పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని డివిజన్లలో కొత్త ప్రాంతాలు కలుస్తుండగా... మరికొన్నిటి పేర్లు కనుమరుగు కానున్నాయి. దాంతో ఇప్పటి వరకు ఆ డివిజన్ల కార్పొరేటర్లుగా పనిచేసినవారు.. భవిష్యత్తులో పోటీ చేయాలనుకుంటున్న వారు తలలు పట్టుకుంటున్నారు. ఆరేడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటి నుంచే పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్న వారు తాజా పరిస్థితులతో అయోమయంలో పడ్డారు. తాము కోరుకుంటున్న డివిజన్ పేరు కనుమరుగు కానుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార పార్టీ పెద్దల అభీష్టానికి అనుగుణంగా డివిజన్లను మారుస్తుండటం అస్తవ్యస్తానికి దారి తీస్తోందని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ముసాయిదాను వెల్లడించాక...  తాడోపేడో తేల్చుకుంటామని అంటున్నారు. తాజా సమాచారం మేరకు వివరాలివీ...

 

అంబర్‌పేట నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకుగాను బర్కత్‌పురా, విద్యానగర్  మాయం కానున్నాయి. బర్కత్‌పురా డివిజన్ నుంచి కార్పొరేటర్లుగా పనిచేసిన పలువురు నేతలు రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు... జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్లుగా వ్యవహరించిన వారూ వీరిలో ఉన్నారు. డివిజన్ కనుమరుగు కానుండటంతో  రాబోయే ఎన్నికల్లో అక్కడి నుంచి నెగ్గి... ఉన్నత స్థాయికి ఎదగాలనే సెంటిమెంట్‌ను నమ్ముకున్నవారు డీలా పడ్డారు. బర్కత్‌పుర డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలు కాచిగూడలో కలవనుండగా...కాచిగూడలోని కొన్ని ప్రాంతాలు గోల్నాకలో కలవనున్నాయి.

  

ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో పాటు గుర్తుకు వచ్చే విద్యానగర్ డివిజన్ సైతం తెరమరుగు కానుంది. దీనిలోని ప్రాంతాలు బాగ్ అంబర్‌పేట, నల్లకుంట డివిజన్‌లలో కలువనున్నాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుల నియోజకవర్గాలైన సనత్‌నగర్, సికింద్రాబాద్‌లలో ఒక్కో డివిజన్ కనుమరుగు కానుంది.



 శ్రీనగర్ కాలనీ డివిజన్ కొంత  భాగం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరికొంత భాగం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో చేరనుంది.సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకుగాను చిలకలగూడ కనుమరుగు కానుంది. బౌద్ధనగర్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్లకు ముప్పులేదని తెలుస్తోంది.   సనత్‌నగర్ నియోజకవర్గంలో విభిన్న వర్గాలు, ఎగువ మధ్య తరగతి ప్రజలతో, మోడల్ కాలనీలతో ప్రత్యేతను సంతరించుకున్న పద్మారావునగర్ డివిజన్ కనుమరుగు కానుంది.  ఖైరతాబాద్ నియోజకవర్గంలో పంజగుట్ట, సోమాజిగూడ ఇతర డివిజన్లలో విలీనం కానున్నాయి.   ఉప్పల్ నియోజకవర్గంలో చిలుకానగర్ పేరిట కొత్త డివిజన్ ఏర్పాటు కానుంది.



రాజేంద్రనగర్ నియోజకవర్గంలో శివరాంపల్లి కనుమరుగై.. కొత్తగా హసన్‌నగర్ డివిజన్ రానుంది.భెల్ ఎంఐజీ కాలనీని పటాన్‌చెరు సర్కిల్‌లో ఏర్పాటు చేయనున్న డివిజన్‌లో కలిపేందుకు సిద్ధమయ్యారు. అక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉన్నందున అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ఇబ్బందులుంటాయనే తలంపుతో ఇలా చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శేరిలింగంపల్లి -2 సర్కిల్‌లో కొత్తగా మాదాపూర్, మియాపూర్ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. కూకట్‌పల్లి డివిజన్‌లోకి కొత్తగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపారాయుడు నగర్, ఆస్‌బెస్టాస్ కాలనీ, దీనబంధు కాలనీలు చేరుతున్నాయి.కొత్తగా ఏర్పడేబాలానగర్ డివిజన్‌లోకి శ్రీశ్రీనగర్ నాలా నుంచి ఫిరోజ్‌గూడ వరకు కలవనున్నాయి.

  

కొత్తగా అవతరించనున్న అల్లాపూర్ డివిజన్‌లో పద్మావతినగర్, పర్వత్‌నగర్, వివేకానంద నగర్, న్యూ రామారావు నగర్, గాయత్రీ నగర్, కొత్తూరు సీతయ్యనగర్‌లతో పాటు మరికొన్ని బస్తీలను కలుపుతున్నారు.మూసాపేట్ డివిజన్ పరిధిలోని జనతానగర్, సేవాలాల్ నగర్ తాండాలను మోతీనగర్‌లో కలపగా... కేపీహెచ్‌బీ కాలనీ 4, 5, 7, 9తో పాటు లోధా హైట్స్, మలేషియా టౌన్‌షిప్‌లను మూసాపేట్‌లోకి చేరుస్తున్నారు.   శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వివేకానంద నగర్, హైదర్‌నగర్ డివిజన్లను మూడుగా ఏర్పాటు చేసి కొత్తగా ఆల్విన్ కాలనీ డివిజన్‌ను రూపొందించారు.

  

ముషీరాబాద్ నియోజకవర్గంలో డివిజన్ల సంఖ్యను 8 నుంచి 6కు తగ్గిస్తున్నారు. మాయమైన దోమలగూడ డివిజన్‌ను రెండుగా చీల్చి కొంతభాగాన్ని గాంధీనగర్‌లో, మరికొంత బాగాన్ని కవాడిగూడలో కలిపారు. దీంతో ప్రాగా టూల్స్ నుంచి హిమాయత్ నగర్ వరకు కవాడిగూడ అతి పెద్ద డివిజన్‌గా అవతరించనుంది.  ఈ నియోజకవర్గంలోని రాంనగర్ మాయమవుతుందా? బాగ్‌లింగంపల్లి మాయమవుతుందా? అనే దానిపై స్పష్టత లేదు. అధికారులు రాంనగర్‌ను మార్చాలని ప్రతిపాదించగా... టీఆర్‌ఎస్ నేతలు మాత్రం దీన్ని ఉంచాలని పట్టుబట్టి అధికారులపై మంత్రులతో ఒత్తిడి తెస్తున్నారు.

  

బాగ్‌లింగంపల్లి డివిజన్‌ను మూడు ముక్కలు చేశారు. పద్మాకాలనీ, అచ్చయ్యనగర్ తదితర ప్రాంతాలను అడిక్‌మెట్ డివిజన్‌లో... ఎల్‌ఐసీ, ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్, పాలమూరు బస్తీ, శ్రీరాంనగర్, లంబాడీ బస్తీలు రాంనగర్ డివిజన్‌లో, చిక్కడపల్లి, సూర్యనగర్, ఏపీహెచ్‌పీ క్వార్టర్స్ గాంధీనగర్ డివిజన్‌లో కలపడంతో భౌగోళికంగా చక్కగా ఉన్న డివిజన్ అతుకుల బొంతగా తయారైంది.పునర్విభజనలోనూ కొన్ని డివిజన్లు రెండు నియోజకవర్గాల పరిధిలోకి రానుండటం కొత్త చిక్కులు తెచ్చేలా ఉంది.

 

టీడీపీ-బీజేపీ ఉద్యమాలు

 హెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై బీజేపీ చేపట్టిన నిరసన ఉద్యమాలలో టీడీపీ పాలు పంచుకోవాలని హైదరాబాద్ జిల్లా టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈనెల 6న సికింద్రాబాద్, 7న కార్వాన్, 8న చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, 9న మలక్‌పేట, 10న నాంపల్లి, 11న అంబర్‌పేట, 12న ఖైరతాబాద్, 13న గోషామహల్, 14న జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఉద్యమాలు  చేపట్టాలని నిర్ణయించారు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top