మళ్లీ ప్రపంచబ్యాంకు బాటలో బాబు


రూ.20,000 కోట్ల అప్పు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

*  ప్రపంచ బ్యాంకు, విదేశీ  సంస్థల నుంచి రుణాలు

* ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం

* వివిధ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రూపొందించాలని ఆదేశం

* రంగాలవారీగా ఉండాలని సూచన




సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ప్రపంచబ్యాంకు బాట పడుతున్నారు. ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రూ. 20 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జెఐసీఏ), డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (డీఎఫ్‌ఐడీ), యునెటైడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్‌ఎఐడీ), కెఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు, కెనడా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (సీఐడీఏ)ల నుంచి రుణాలు తెచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

 

అందులోగల అవకాశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ, రవాణా, రహదారులు - భవనాలు, పరిశ్రమలు, మౌలిక వసతులు - పెట్టుబడులు, ఇంధన, విద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, వ్యవసాయం, అటవీ పర్యావరణ శాఖలు విదేశీ అప్పుల కోసం అవసరమైన ప్రాజెక్టులను తయారు చేయాలని సూచించారు. వివిధ రంగాల్లో అభివృద్ధితో పాటు సంస్కరణలు చేపట్టేలా వీటిని రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాగానే ఈ ప్రాజెక్టుల నివేదికలను కేంద్రానికి పంపించి ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా విదేశీ సంస్థల నుంచి తీసుకునే అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం మేర గ్రాంటుగా భరిస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది.

 

 రూపొందించే ప్రాజెక్టులు, తీసుకొనే రుణం..

* వ్యవసాయ, ఇతర రంగాలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లను వేర్వేరు చేయడంతో పాటు సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తికి రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్లు

* కొత్త రాజధాని నిర్మాణంతో పాటు రోడ్ నెట్‌వర్క్, నీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణకు కూడా రూ. 3 వేల కోట్లు

* జపాన్, చైనా, కొరియన్ టౌన్‌షిప్‌లలాగ ఒక థీమ్ (ఇతివృత్తం) ఆధారంగా టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రూ. 4 వేల కోట్లు

* జల రవాణా మార్గాల అభివృద్ధికి పర్యాటక కేంద్రాలను రూపొందించి, బకింగ్‌హాం కెనాల్‌ను కాకినాడ, విజయవాడ ఇతర పట్టణాలకు అనుసంధానం చేయడానికి సుమారు రూ. 3 వేల కోట్లు

* నాలెడ్జ్ హబ్‌ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు

* నగరాలు, పట్టణాల్లో ఉమ్మడిగా మౌలిక వసతుల కల్పనకు రూ. 3 వేల కోట్లు

* గుజరాత్‌లోని జీఐఎఫ్‌టీ తరహాలో ఆర్థిక, సాంకేతిక (టెక్నికల్) నగరాల నిర్మాణానికి రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top