'చనిపోతే సెలవు ఇవ్వొద్దన్నారు'

'చనిపోతే సెలవు ఇవ్వొద్దన్నారు' - Sakshi


హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తనకు ఆత్మీయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాంటి ఆత్మీయుడిని కోల్పోవడం బాధకరంగా ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చంద్రబాబు ఆయన మంత్రి వర్గం అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... నిరంతరం శ్రమించడం వల్లే అబ్దుల్ కలాం అత్యున్నత శిఖరాలు చేరుకున్నారన్నారు.


కలాం ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్' యువతకు ఓ స్ఫూర్తి అన్నారు. నిజమైన భారతరత్న అబ్దుల్ కలాం అని అన్నారు. జీవితాంతం పరిశోధనలపై దృష్టి పెట్టిన వ్యక్తి ఆయన అని కలాం సేవలను కొనియాడారు. తాను చనిపోతే సెలవు ఇవ్వొద్దని చెప్పిన మహనీయుడు కలాం అని శ్లాఘించారు. ఆయన చెప్పిన కొన్ని స్ఫూర్తివంతమైన మాటలను ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేదన్నారు.


నీతి నిజాయితీ, పట్టుదలతో ఆయన పని చేసేవారని చెప్పారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం చిన్ననాటి నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టే వరకు ఆయన జీవిత విశేషాలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ... ఆయన ఏ కలలైతే కన్నారో... ఆ విధంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు యువతకు సూచించారు. అబ్దుల్ కలాం స్టేట్స్ మెన్ అని స్పష్టం చేశారు.


దేశానికి స్టేట్స్ మెన్గా ఉండి... దేశభక్తితో దేశానికి అబ్దుల్ కలాం సేవ చేశారన్నారు. తుది శ్వాస వరకు అబ్దుల్ కలాం పని చేస్తూనే ఉన్నారన్నారు. అలాగే ఇటీవల అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆహార ప్రక్రియ విధానంపై ఏర్పాటు చేసిన సభకు అబ్దుల్ కలాం విచ్చేసి ప్రసంగించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలలో భారతరత్న అబ్దుల్ కలాంకు నివాళులు ఆర్పించాలని తమ ప్రభుత్వం ఆదేశించిందని చంద్రబాబు చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top