కోటీశ్వరుల రాజధానిగా అమరావతి

కోటీశ్వరుల రాజధానిగా అమరావతి - Sakshi


కోటీశ్వరుల రాజధాని వద్దు

వైఎస్సార్‌సీపీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం




హైదరాబాద్: రాష్ట్రానికి రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిగా ఉండాలి గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కోటీశ్వరుల రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తీరు చూస్తుంటే అమరావతిలో నిర్మించేది మన రాష్ట రాజధానా? లేక సింగపూర్ రాజధానా? అనే అనుమానం కలుగుతోందన్నారు. కోటీశ్వరుల కోసమే రాజధాని అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేతిలో అధికారం ఉంది కదా అని తాము ఏం చెబితే అదే శాసనం, ఏది చేస్తే అదే విధానం అన్నట్లుగా టీడీపీ వ్యవహరించడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. మన దేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిష్ వాళ్లు కూడా ఇలాంటి నిబంధనలు పెట్టి ఉండరని, ఇంత దుర్మార్గంగా వ్యవహరించి ఉండరని ఆయన పేర్కొన్నారు.



రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ సంస్థలు కోరుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించిందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను మోసగించి భారీగా దోపిడీ చేసుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. రెండేళ్లుగా నిద్ర నటించిన చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా రాజధాని, సచివాలయాన్ని తరలించుకుపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తాత్కాలిక సచివాలయంలో ఒక్క గది కూడా సిద్ధం కాకుండానే అక్కడికి వెళ్లి హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రాజధానిలో సింగపూర్‌కు భూములు కట్టబెట్టడాన్ని తాము ప్రతిపక్షం కనుక వ్యతిరేకించడం లేదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వ్యతిరేకించామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.



సింగపూర్‌పై ఎందుకంత ప్రేమ?

కొన్నేళ్లుగా చంద్రబాబు మనిషిగా ఇక్కడున్నాడు తప్పితే ఆయన మనసంతా సింగపూర్‌లోనే ఉందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి సింగపూర్‌పై ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదన్నారు. భారతదేశంలో బ్రహ్మాండమైన ఇంజినీర్లు, ప్రపంచం గర్వించదగ్గ నిపుణులు ఉండగా, వారిని కాదని రాజధానిని విదేశీ సంస్థల చేతుల్లో పెట్టడం ఏమిటని నిలదీశారు. విశాఖపట్టణంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినపుడు రూ 4.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారని, అలాగే వివిధ దేశాలు తిరిగినపుడు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారని ఒప్పందాలు కుదుర్చుకున్న వన్నీ వచ్చాయా ? అని ఆయన ప్రశ్నించారు.



శ్రీసిటీలో చంద్రబాబు ప్రారంభించిన పరిశ్రమలన్నీ గత ప్రభుత్వాలు ప్రారంభించినవేనని, నేమ్‌ప్లేట్లు మార్చి కార్యక్రమాలు చేశారని ఆయన అన్నారు. చైనా పర్యటనలో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించడానికి అంగీకరించినట్లుగా చెబుతున్న సంస్థ ఒక ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంస్థ అని ఆయన అన్నారు. భద్రతా సమితిలో భారత్‌కు సభ్యత్వం రాకుండా గట్టిగా అడ్డుకుంటున్న చైనాపై ఏ నమ్మకంతో ఒప్పందాలు చేసుకుంటారని కూడా ఆయన ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top