ఉంగరాలూ మింగేశారు!

ఇది డ్రైవర్ ప్రమోద్ విలాసం (ఫైల్ ఫోటో) - Sakshi


ఓ హోటల్ వద్ద న్యాయవాది కారు చోరీ

నెల తరువాత దొరికిన  వాహనం

ఆభరణాలు మాయం

పోలీసుల మాయాజాలం


 

 సాక్షి, సిటీబ్యూరో : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారుల అక్రమాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు సీజ్ చేసిన కార్లను పంచుకోవడం... కోర్టు అనుమతి లేకుండానే అమ్ముకోవడం... చీటింగ్ కేసులో 16 మంది నిందితుల పేర్లు గోల్‌మాల్ చేయడం లాంటి ఉదంతాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అక్రమ వ్యవహారం బయట పడింది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని దసపల్లా హోటల్‌లో చోరీకి గురైన బీఎండబ్ల్యూ కారులో ఉన్న న్యాయవాదికి చెందిన మూడు వజ్రపుటుంగరాలను సీసీఎస్ ఆటోమొబైల్ టీం పోలీసులు మింగేసినట్టు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 3 లక్షలుగా తెలుస్తోంది.



ఆ న్యాయవాది నెల రోజుల పాటు ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవల సీసీఎస్ పోలీసుల బాగోతాలు వరుసగా తెరపైకి వస్తుండడంతో ఉంగరాలు కాజేసిన ఉదంతంపై కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివీ... గత ఏడాది నవంబర్ 29న బాగ్  అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది దిండకుర్తి నారాయణ కిషోర్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు డిన్నర్‌కు వెళ్లారు. తన బీఎండబ్ల్యూ కారు (ఏపీ 10 టీజే టీఆర్ 6384)ను వాలెట్ పార్కింగ్‌లో అప్పగించి వెళ్లగా... తిరిగి వచ్చేసరికి అపహరణకు గురైంది.



ఈ విషయమై అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో మూడు వజ్రాలు పొదిగిన ఉంగ రాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.  వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... బంజారాహిల్స్‌లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతూ జల్సాలకు అలవాటు పడిన తిరువీధుల సుమన్ అనే యువకుడు కారును త స్కరించినట్లు గుర్తించారు. ఈ కేసును అప్పటికే సీసీఎస్‌లోని ఆటోమొబైల్ టీంకు అప్పగించారు. వారు సుమన్‌ను అదుపులోకి తీసుకొని వివరాలు రాబట్టారు. సీసీఎస్ ఆటో మొబైల్ విభాగం సీఐ ప్రసాద్ కారును స్వాధీనం చేసుకున్నారు.



నిబంధనలకు విరుద్ధంగా హోంగార్డుగా నమ్మించి ప్రైవేట్ డ్రైవర్‌తో వాహనాన్ని తరలించారు. కారులో ఉన్న మూడు ఉంగరాలను నొక్కేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దాంతో ప్రైవేట్ డ్రైవర్, బన్ను ప్రమోద్ మరుసటి రోజు నుంచి పరారైనట్టు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా అక్రమాలు బయట పడ డ ంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాయమైన ఉంగరాల వ్యవహారంపై సీసీఎస్ పోలీసులను విచారిస్తున్నారు.



కనిపించడం లేదన్నారు...

చోరీ కేసులో దొరికిన కారును ప్రైవేటు డ్రైవర్ ప్రమోద్‌తో ఎలా తెప్పించారని న్యాయవాది నారాయణ కిషోర్ ప్రశ్నించారు. తన కారు డిక్కీలో ఉన్న వజ్రాల ఉంగరాలను ప్రమోద్ తీశాడని... అతన్ని ఆ రోజే పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడని తెలిపారు.  ఉంగరాలు ఇప్పించాలని సీఐ ప్రసాద్‌ను వేడుకుంటే... ఇప్పిస్తానని చెప్పారని... చివరకు అతను కనిపించడం లేదని సమాధానమిచ్చారని న్యాయవాది ‘సాక్షి’కి తెలిపారు. ప్రసాద్‌ను గానీ, ప్రమోద్‌ను గానీ అదుపులోకి తీసుకుని విచారిస్తే తన ఉంగరాలు దొరకుతాయని భావిస్తున్నారు.



విమానాల్లో చక్కర్లు... స్టార్ హోటళ్లలో విందు

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బన్ను ప్రమోద్‌ను సీఐ ప్రసాద్ తన కారుకు ప్రయివేటు డ్రైవర్‌గా పెట్టుకున్నారు. సీసీఎస్‌లో మాత్రం అందరూ అతనిని హోంగార్డుగా పరిగణించారు. విమానాల్లో ప్రయాణాలు... స్టార్ హోటళ్లలో విందులు...ఇదీ ప్రమోద్ వ్యవహార శైలి. అతనికి నెలకు రూ.10 వేలు మాత్రమే జీతంగా వచ్చేది. ఈ వేతనంతో విమాన ప్రయాణాలు... స్టార్ హోటళ్లలో భోజనాలు సాధ్యం కాదనేది తెలిసిందే. మరి విలాసాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. పరారీలో ఉన్న ప్రమోద్‌ను పట్టుకుంటే సీసీఎస్ అధికారుల అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top