సీబీఐ విచారణ జరిపించాలి

సీబీఐ విచారణ జరిపించాలి - Sakshi


- ‘సదావర్తి’ కుంభకోణంపై వైఎస్సార్‌సీపీ డిమాండ్

- తాజా నిబంధనలతో బాబు నిజస్వరూపం తేటతెల్లమైంది

 

 సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ బినామీ అయిన చలమలశెట్టి రామానుజయకు సదావర్తి సత్రం భూముల్ని కారుచౌక ధరలకు ధారాదత్తం చేసిన కుంభకోణంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రామానుజయ వేలంలో దక్కించుకున్నట్లు చెబుతున్న మొత్తంకన్నా రూ.5 కోట్లు అదనంగా ఇచ్చినవారికి సదావర్తి భూముల్ని ఇచ్చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. తీరా సంస్థలు ముందుకొస్తే వాటిని భయకంపితులను చేసేవిధంగా నిబంధనలు విధించారని విమర్శించారు. తన కుమారుడి బినామీలకే సదావర్తి భూములు దక్కాలనేది చంద్రబాబు ఎజెండా అని, అందుకే వీటికి పత్రాల్లేవు కనుక, తమిళనాడులో వాటిని స్వాధీనం చేసుకునే బాధ్యత వేలంలో తీసుకున్నవారిదేనని నిబంధన విధించారన్నారు. ఒక సీఎంగా చంద్రబాబు ఇలా మాట్లాడ్డం సిగ్గుచేటన్నారు.



 బాధ్యతను వారిపై మోపడమేంటి?

 దేవాదాయ భూముల అమ్మకాలకు హైకోర్టు అనుమతి తీసుకోవాలన్న నిబంధనలున్నా చంద్రబాబు లెక్కచేయకుండా కథ నడిపారని వేణుగోపాల్ దుయ్యబట్టారు. ప్రభుత్వం సవాలు విసిరినట్టుగా రూ.5 కోట్లు అదనంగా ఇస్తామని వచ్చినవారికి వంద షరతులు విధించడం, తమిళనాడులో ఉన్న ఈ భూమిని స్వాధీనం చేసుకునే బాధ్యతను వారిపైనే మోపడం ఏమిటన్నారు. అవి దేవాదాయ భూములు కనుక సీఎం హోదాలో పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి దేవాదాయశాఖకే చెందేలా చూడాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నిజస్వరూపం, నైజం తేటతెల్లమైందన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top