లేడీ డాన్ ఫరాఖాన్‌పై కేసు
హైదరాబాద్ : నగరంలో పేరుమోసిన లేడీ డాన్ ఫరాఖాన్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూసుఫ్‌గూడకు చెందిన సంతోష్‌కుమార్ అనే కేబుల్ వ్యాపారి 2014లో ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశాడు. అతని స్నేహితుడు చందు కారు అడగడంతో రూ. 1.50లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని కారు ఇచ్చాడు.
అయితే రెండు నెలల తరువాత కారు అడగ్గా తన వద్ద కారు వేరే వారికి ఇచ్చానని చందు చెప్పాడు. దీనిపై చందును సంతోష్ నిలదీశాడు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్ నె.1లోని జీవీకె వన్ మాల్లో కారుకు ఫైనాన్స్ చేసిన సిబ్బంది గుర్తించినట్లు సంతోష్ తెలిపాడు. ఫైనాన్స్ సిబ్బంది కారును సీజ్ చేసేందుకు ప్రయత్నించగా అందులో లేడీడాన్ ఫరాఖాన్ ఉందని తెలిపారు. కారు ఫైనాన్స్‌లో ఉందని చెప్పగా ఇంటికి వచ్చి మాట్లాడాలంటూ ఫరాఖాన్ చెప్పిందన్నారు.
కారును ఇవ్వాల్సిందిగా సంతోష్ ఫరాఖాన్‌ను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో ఫరాఖాన్‌తో సహా పలువురిపై సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఛీటింగ్ చేశారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో వాపోయాడు. ఈ మేరకు పోలీసులు ఫరాఖాన్‌తో పాటు చందు, శేషు, రవి అనే వారిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 408, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.